జనవరి 10న అమెరికా, రష్యా భేటీ

జనవరి 10న అమెరికా, రష్యా భేటీ
ఎన్నాళ్ళగానో అందరూ ఎదురుచూస్తున్న అమెరికా, రష్యా చర్చలు జనవరి ప్రారంభంలో జరగనున్నాయి. యురోపియన్‌ భద్రత, ఉక్రెయిన్‌ ఘర్షణలపై ఈ చర్చలు దృష్టి కేంద్రీకరించనున్నాయి. 
 
జనవరి 10న ఈ చర్చలు జరుగుతాయని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి సోమవారం చెప్పారు. మంగళవారం రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గి రిబకొవ్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. జెనీవాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా నేత వ్లాదిమిర్‌ పుతిన్‌లు సమావేశమవుతారని తెలిపారు. 
 
రష్యాతో చర్చలు జరిపేందుకు అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోందని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించారు. చర్చల్లో ఇరుపక్షాలు వారి ఆందోళనలను, వాదనలను ప్రస్తావిస్తాయని అన్నారు. ఆ తర్వాత జనవరి 12వ తేదీన రష్యా, నాటో ప్రతినిధులు సమావేశమవుతారని భావిస్తున్నారు. 
 
ఆ మరుసటి రోజు అర్గనైజేషన్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ కో ఆపరేషన్‌ ఇన్‌ యూరప్‌ (ఓఎస్‌సిఇ), రష్యా సమావేశం జరగనుంది. ఈ ఏడాది జూన్‌లో మొదటిసారిగా సమావేశమైనపుడు ప్రారంభించిన వ్యూహాత్మక భద్రతా చర్చల చొరవలో భాగంగా జనవరి 10వ తేదీ సమావేశం జరగనుంది. 
 
కాగా, నాటో, రష్యా సమావేశం, ఓఎస్‌సిఓ, రష్యా సమావేశాలు ఉక్రెయిన్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నాయి. ఈ సమావేశంలో తమ ప్రయోజనాలను పరిరక్షించుకునేలా, రాయితీలను వద్దనుకునేలా కఠినమైన వైఖరి తీసుకుంటామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌ చెప్పారు.