గోరటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

గోరటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడు, జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ‘వల్లంకి తాళం’ కవితా గేయ రచనకు వెంకన్నకు అవార్డు ఇచ్చారు. 
 
2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్టు లభించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి ఏటా 20 భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందిన సాహిత్యానికి అవార్డులు ప్రకటించడం ఆనావాయితీ వస్తోంది. 
 
తెలుగు భాషకు సంబంధించి సాహిత్య అకాడమీ యువ పురస్కార్-2021 అవార్డు తగుళ్ల గోపాల్ కు దక్కింది. గోపాల్ రచించిన “దండకడియం” కవితాసంపుటికి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు వచ్చింది. అలాగే.. దేవరాజు మహారాజుకు బాల సాహిత్య పురస్కారం వరించింది. “నేను అంటే ఎవరు” నాటకానికి ఈ అవార్డు వచ్చింది.
 
2016లో తెలంగాణ ప్రభుత్వం వెంకన్నకు కాళోజీ పురస్కారం అందించింది. 2006లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును ప్రదానం చేసింది. అంతేకాకుండా తెలంగాణ పాటను విశ్వవ్యాప్తం చేసిన గోరటి వెంకన్నకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019లో “కబీర్‌ సమ్మాన్‌’ పురస్కారం ప్రదానం చేసింది. 
 
జానపద పాటలతో ప్రజల్ని  ఎంతో ఆకట్టుకునే వెంకన్న.. మా టీవీలో ప్రసారమైన రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జన్మించిన వెంకన్న ..పల్లె ప్రజలు, ప్రకృతిపై ఎన్నో పాటలు రాయడమే కాకుండా పాడి, డాన్సులతో ఉర్రూతలూగిస్తారు.  ఆయన రాసిన వీ6 న్యూస్ 2019 బతుకమ్మ పాట ఎంతగానే ఆకట్టుకుంది. 
ఈ సందర్బంగా ఆయనకు రావడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హర్షం ప్రకటించారు. దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సిఎం కొనియాడారు. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని.. మనిషికి ఇతర జంతు పక్షి జీవాలకు వున్న అనుబంధాన్ని గోరటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని కేసీఆర్ తెలిపారు.