
‘కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గం కన్నా మిన్న అంటారు.. దీనికి నేను మాతృభాషను కూడా జోడిస్తాను.. తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నాను’.. అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పేర్కొన్నారు.
‘పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న మహాత్ముని మాటలూ అక్షర సత్యమని, ఎంత అత్యున్నత స్థాయికి ఎదిగిన వారైనా పల్లె బిడ్డలే అని చెప్పారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి శుక్రవారం విచ్చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు అత్యంత ఇష్టమైన ఎడ్లబండిపై ఆయనను మేళతాళాల మధ్య ఊరేగించారు. పెద్దఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు జాతీయ జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం గ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పటికీ తన మూలాలు ఈ గ్రామంలోనే ఉన్నాయని.. ఢిల్లీకి రాజైనా.. తాను ఎప్పటికీ పల్లె బిడ్డనే అని స్పష్టం చేశారు.
గ్రామస్తులే తనకు తల్లిదండ్రులని, గ్రామాన్ని వదలి ఎంతో కాలమైనా, అత్యున్నత స్థానంలో ఉండి తన స్వగ్రామానికి రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు రాజు, మార్కండేయులును ఆయన గుర్తుచేసుకున్నారు.
ఇటువంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులవల్లే తాను దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కాగలిగానని తెలిపారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలను ఎల్లవేళలా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని ఈ సందర్భంగా జస్టిస్ రమణ సూచించారు.
More Stories
అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రోడ్ షో రద్దు
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు