
పార్లమెంట్ ఉభయ సభల శీతాకాల సమావేశాలు ఒకరోజు ముందే నేడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోని ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలు, ప్రభుత్వ వ్యూహంపై చర్చించారు.
నవంబర్ 29న శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి, 12 మంది ఎంపీల సస్పెన్షన్, లఖింపూర్ ఖేరీ ఘటన, తదితర అంశాలపై ప్రతిపక్షాల రగడతో పార్లమెంట్ ఉభయ సభలు నిరంతరాయంగా ఆటంకాలు ఎదుర్కొన్నాయి.
వాస్తవంగా శీతాకాల సమావేశాలు రేపు (గురువారం) ముగియాల్సి ఉన్నప్పటికీ ఒక రోజు ముందుగానే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ, లోక్ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాల పాటు శీతాకాల సభా సమయం వృధా అయినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయినా కీలకమైన బిల్లుల గురించి చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా పొందినట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో ఒమిక్రాన్, వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరిగినట్లు ఓం బిర్లా తెలిపారు.
రాజ్యసభలో చైర్మెన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. శీతాకాల సమావేశాలు అంచనాలకు తగిన రీతిలో జరగలేదని విచారం వ్యక్తం చేశారు. నిజానికి ఈ సమావేశాలు మరింత బాగా జరగాల్సి ఉందని, ఎక్కడ తప్పు జరిగిందో సభ్యులో ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలును తెలిపారు.
కీలకమైన ఎలక్టోరల్ జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేసే బిల్లు మంగళవారంనాడే పార్లమెంటు ఆమోదం పొందింది. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. గత వర్షాకాల సమావేశాల చివరిరోజు సస్పెండ్ అయిన 12 మంది రాజ్యసభ సభ్యులపై ఈ సమావేశాల చివరివరకూ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో వారు నిరసనలకే పరిమితమయ్యారు.
ప్రతిరోజూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసనలు తెలుపుతూ వచ్చిన ఎమ్మెల్యేలకు విపక్షాలు సంఘీభావం తెలపడం, ఉభయసభల్లోనూ సస్పెన్షన్ ఎత్తివేతకు డిమాండ్ చేయడంతో పలు అవాంతరాలు తలెత్తాయి. మంగళవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్‌పై రాజ్యసభలో సస్పెన్షన్ వేటు పడింది.
ఎన్నికల సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డెరెక్ ఓబ్రెయిన్ రాజ్యసభ నియమాల పుస్తకాన్ని విసిరిగొట్టినందుకు ఆయనపై శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెన్షన్ వేటు పడింది.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం