ప్రస్తుతం 89 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిందని, సామాజిక వ్యాప్తితో మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ శనివారం వెల్లడించింది. జనాభాలో అత్యధిక స్థాయిల్లో ఇమ్యూనిటీ ఉన్న దేశాల్లో కూడా ఇది వేగంగా విస్తరిస్తోందని తెలిపింది.
ఇమ్యునిటీని తప్పించుకునే సామర్ధం దీనికి ఉండడం వల్ల వ్యాపిస్తోందా లేక దాని స్వాభావిక వ్యాప్తి లక్షణం పెంపొందడం వల్లనా అన్నది స్పష్టం కావడం లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా అభిప్రాయపడింది. మొట్టమొదట ఇది బయటపడినప్పుడే ఒమిక్రాన్ ఆందోళన కలిగించే వేరియంట్‌గా నవంబర్ 26 న ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తించింది.
ఇది ఎంతవరకు తీవ్ర అస్వస్థత కలిగిస్తుందో తదితర లక్షణాలేవీ ఇప్పటికీ తెలియరావడం లేదని పేర్కొంది. వైద్యపరంగా దీని తీవ్రత గురించి పరిమిత సమాచారమే తమ వద్ద ఉందని డబ్లుహెచ్‌ఒ తెలియచేసింది.
ముఖ్యంగా ఆగ్నేయాసియాలోని ఏడు దేశాల ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించడంతోనే దీన్ని అడ్డుకోవచ్చునని డబ్ల్యూహెచ్‌వో ఈశాన్య ఆసియా డైరెక్టర్ పూనం ఖేత్రపాల్‌సింగ్ చెప్పారు. వైరస్ రిస్క్ ఎక్కువగా ఉన్న వారిని కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
డెల్టా కంటే ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌పై పూర్తి సమాచారం మున్ముందు పూర్తి వివరాలు వెల్లడవుతాయని పూనంఖేత్రపాల్ సింగ్ చెప్పారు. దీంతో రీ ఇన్‌ఫెక్షన్ ప్రమాదం ఉందని దక్షిణాఫ్రికా పేర్కొన్నందున ఒమిక్రాన్‌ను తక్కువ అంచనా వేయొద్దని స్పష్టం చేశారు.
వ్యక్తిగత సంరక్షణతోపాటు ఒకరినొకరు రక్షించుకోవాలని సూచించారు. అన్ని విభాగాల్లో వైద్యంతోపాటు ఐసీయూ బెడ్స్ కెపాసిటీ, ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. మహమ్మారిని అంతం చేయడానికి వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యం అని పూనం ఖేత్రపాల్‌సింగ్ అన్నారు.
కాగా, మరో సూపర్ వేరియంట్ ముప్పు పొంచి ఉందని బ్రిటన్ ఆరోగ్య నిపుణుడు డాక్టర్ పాల్ బర్టన్ హెచ్చరించారు. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు డీఎన్ఏ మార్చుకుంటున్నది. తాజాగా ఒమిక్రాన్, డెల్టా స్ట్రెయిన్స్ రెండూ కలిసి ఇన్‌ఫెక్ట్ అయితే సూపర్ వేరియంట్ ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం బ్రిటన్‌లో డెల్టా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో సూపర్ వేరియంట్‌పై ప్రజల్లో ఆందోళనలు తలెత్తుతున్నాయి. సాధారణంగా కరోనా వైరస్ మానవులకు ఒకసారి మాత్రమే సోకుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రెండు స్ట్రెయిన్లు కలిసి ఇన్‌ఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ బర్టన్ చెప్పారు.
ఒకవేళ డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌లు రెండూ ఒక కణంలోకి ఇన్‌ఫెక్ట్ అయితే.. ఒక స్ట్రెయిన్ డీఎన్ఏ.. మరొకదాంతో మార్చుకుంటాయి. ఈ రెండు కలిస్తే ప్రమాదకర సూపర్ స్ట్రెయిన్ పుట్టుకొస్తుందని హెచ్చరించారు. ఈ రెండు వైరస్‌లు జన్యువులు మార్చుకుంటాయని పేర్కొన్నారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు