విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి సరఫరా

విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి సరఫరా
ఆంద్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీ గంజాయి అక్రమ సాగుకు  దేశంలోనే కీలకమైన కేంద్రంగా కొనసాగుతున్నది. ఇక్కడి నుండి పొరుగు రాష్ట్రాలకే  కాకుండా, పొరుగు దేశాలకు సహితం అక్రమ రవాణా జరుగుతున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణాలో ఇటీవల పట్టుబడిన పలు అక్రమ గంజాయి సరుకులు అన్ని విశాఖ ఏజెన్సీ నుండి తెలంగాణ మీదుగా ముంబై, ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్నవే కావడం గమనార్హం. 
 
 తాజాగా,  నర్సీపట్నం నుండి ముంబై కిఫ్ అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలో 10 మందిని  రాచకొండ ఎస్ ఓ టి పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు సుబ్బారావు పరారయ్యాడు. నిందితుల వద్ద నుండి సుమారు రూ 90 లక్షల విలువైన 240 కేజీల గంజాయి, ఒక లారీ, రెండు కార్లు, 8 లక్షల నగదు, 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వీరు ఒడిశా-ఆంద్రా సరిహద్దులోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి సేకరించి అక్రమంగా ముంబయికి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు, వనస్థలిపురం పోలీసులు ఉమ్మడిగా తనిఖీలు చేసి ముఠాను పట్టుకున్నారు.

గంజాయి ముఠా సూత్రధారి కేరళవాసి శివన్ కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఇతడు ఒడిశా రాష్ట్రంలోని అల్లుడుకోటా వద్ద ఉన్న గౌండ్ల గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కేరళ నుంచి ఒడిశాకు సరుకులు తీసుకొచ్చిన లారీల వారిని మళయాళంలో మాట్లాడి ఆకట్టుకునేవాడు. 
 
ఎక్కువ కిరాయి ఆశ చూపి ముంబయికి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నాడు. ఒడిశా ఆంధ్ర సరిహద్దులోని ఏవోబీ ఏజెన్సీలో కిలో రూ 8వేలకు గంజాయి కొని మహారాష్ట్ర, ముంబయి ఏరియాలో కిలో రూ 15వేలకు అమ్ముతున్నాడు. ఎరువులు, ఇతర సరుకుల ముసుగులో గంజాయి పార్శిల్ చేసి పంపిస్తున్నాడు. 
 
గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న ఈ అక్రమ రవాణా గురించి ఉప్పందడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీసుల సహకారంతో ముఠా ఆచూకీ కనిపెట్టు అదుపులోకి తీసుకున్నారు. anja,