విశ్వశాంతికి భగవద్గీత మార్గనిర్ధేశమే పరిష్కారం 

విశ్వశాంతికి భగవద్గీత మార్గనిర్ధేశమే పరిష్కారం 
సంపూర్ణ విశ్వశాంతి కోసం భగవద్గీత ప్రవచించిన మార్గనిర్ధేశం ఒక్కటే పరిష్కారమని శ్రీరామజన్మభూమి ట్రస్టు కోశాధికారి గోవింద్‌ దేవ్‌ మహారాజ్‌ చెప్పారు. భగవద్గీత ఆవిర్భావ దినోత్సవం గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన లక్ష యువ గళ గీతార్చనలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
 
ఇది ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప బహుమానం అని చెప్పారు. అనేక దేశాల్లో ప్రజలు భగవద్గీతను తమ జీవితానికి అన్వయించుకొని ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని ఆయన తెలిపారు.  వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి లభించిన గొప్ప బహుమతి భగవద్గీత అని, అది భారతీయుల వారసత్వ సంపదని పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా ఉద్ఘాంటించారు.
కార్యక్రమం లో చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి గొప్ప వారసత్వ సంపద భగవద్గీత, రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలని చెప్పారు. విజ్ఞాన శాస్త్రానికి అందని ఎన్నో రహస్యాలను భారతీయ వైదికగ్రంథాలు, ఉపనిషత్తులు వివరించాయని పేర్కొన్నారు. 
 
జీవితం, ఖగోళం, కాలం వంటి అనేక అంశాలపై ప్రపంచానికి అవగాహనను, జ్ఞానాన్ని ప్రబోధించిన మహోన్నతమైన భారతదేశం, భగవద్గీత విశ్వగురువులుగా నిలిచాయని ఆయన చెప్పారు. గీత సందేశం ఎప్పటికీ కొత్తగా, వైవిధ్యంగానే ఉంటుందని తెలిపారు. అనేక చోట్ల ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని, ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటి పరిరక్షణకు ఉద్యమించాలని ఈ సందర్భంగా జియ్యర్ స్వామి పిలుపిచ్చారు. 

ఉడుపి పెజావర్‌ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి మాట్లాడుతూ అందరం అర్జునుడిలాగా కర్తవ్య నిర్వహణ చేస్తే సంపద, విజయం వరిస్తాయని తెలిపారు. వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిళింద పరాండే, జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

తొలుత వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, విశ్వహిందూ కార్యకర్తలు, పిల్లలు, పెద్దలు, మహిళలు, వివిధ రంగాల వారు భగవ ద్గీత ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గంగాధర శాస్త్రి నేతృత్వంలో భగవద్గీతలోని 40 శ్లోకాలను పది నిమిషాల పాటు పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్‌ షో, భక్తి నృత్య గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.