
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి ఏపీకి 23.68 టీఎంసీలు, తెలంగాణకు 88.82 టీఎంసీల నీటిని వాడుకునేందుకు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్‌పురే నీటి విడుదల ఉత్తరువులిచ్చారు. వానాకాలం సీజన్‌లో డిసెంబర్ 15 వరకు ఈ మేరకు నీటిని వాడుకునేందుకు బోర్డు ఓకే చెప్పింది.
ఈ నీటి సంవత్సరంలో నవంబర్ నెలాఖరు వరకు 212.43 టీఎంసీలు ఉపయోగించుకోగా, తెలంగాణ 81.85 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగిందని ఈ ఉత్తరువు వెల్లడించింది. ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకున్న నీటికన్నా తెలంగాణ అన్ని ఔట్ల నుంచి కలిపి 18 టీఎంసీలు తక్కువ నీటిని వాడుకుంది.
మొత్తంగా డిసెంబర్ 15 నాటికి ఏపీ 236.13 టీఎంసీలు, తెలంగాణ 170.67 టీఎంసీలు వాడుకునేందుకు బోర్డు అనుమతిన్చింది. ఇందులో ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి 5.22 టీఎంసీలు, హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా 4.14, నాగార్జునసాగర్ కుడి కాలువకు 11.77, ఎడమ కాలువకు 2.55 టీఎంసీలు తీసుకునేందుకు ఓకే చెప్పింది.
తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 22.57 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ నుంచి 33.66, ఏఎమ్మార్ ఎస్‌ఎల్బీసీ నుంచి 23.89, హైదరాబాద్ తాగునీటికి 8.70 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
కాగా నీటి విడుదల ఉత్తరువు లేకుండానే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు నీటిని వాడుకుంటే బోర్డు ఏర్పాటు స్ఫూర్తి దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే వానాకాలం పంట సీజన్ ముగిసే ముందు రోజు కృష్ణా బోర్డు ఈ ఉత్తరువు ఇచ్చినట్లు చెప్తున్నారు. బోర్డు అనుమతి ఇచ్చిన 236 టీఎంసీలను ఏపీ వాడుకుంది.
తెలంగాణకు 170 టీఎంసీలు వాడుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా 100 టీఎంసీలు కూడా లేవు. ఏపీ కృష్ణా డెల్టా సిస్టం కింద వాడుకున్న 182 టీఎంసీల నీళ్ల లెక్కను ఈ ఉత్తరువులో పేర్కొనలేదు. కేడీఎస్ ఔట్ లెట్‌కు ఇన్ని నీళ్లు అవసరమని ఏపీ నుంచి బోర్డుకు ఇండెంట్ కూడా పంపలేదు.
ప్రాజెక్టులన్నీ మిగులు అయ్యే రోజుల్లో ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి 5 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని తీసుకున్నామని లెక్కల్లో చెప్పింది. దీనిపై త్రిసభ్య కమిటీలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి