కర్ణాటకలో బిజెపికి దగ్గరవుతున్న జేడీఎస్ 

నవంబరు 30న ప్రధాని నరేంద్ర మోదీ, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను తన చేతులతో పట్టుకుని పార్లమెంటరీ భవన్‌లో “సహృద్భావ సమావేశం”కు తీసుకు వెడుతున్న ఫోటోలు కర్ణాటకలో డిసెంబర్ 10న జరుగనున్న  కీలకమైన విధాన పరిషత్ ఎన్నికల సందర్భంగా నూతన సమీకరణలకు దారితీస్తున్నట్లు వెల్లడి అవుతున్నది.

జులై 2019లో కాంగ్రెస్ ఎమ్యెల్యేలు పెద్ద ఎత్తున బీజేపీలోకి ఫిరాయించడంతో జేడీఎస్ ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి కర్ణాటకలో బిజెపి – జేడీఎస్ ల మధ్య రాజకీయ వైరుధ్యం పతాక స్థాయికి చేరుకొంది.  కానీ ఇప్పుడు, రాష్ట్ర శాసన మండలిలో 25 స్థానాలకు స్థానిక సంస్థల నుండి ఎన్నికలు జరగడంతో కాంగ్రెస్, బీజేపీలకు సమానదూరం అనే తమ వైఖరికి విడిచిపెట్టి, అధికార బిజెపితో  అవగాహనకు జేడీఎస్ సిద్దమవుతున్నట్లు కనిపిస్తున్నది. 

దేవెగౌడ- మోదీ  సమావేశం ముగిసిన వెంటనే, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ , దేవెగౌడ కుమారుడు హెచ్‌డి కుమారస్వామి,  బిజెపి మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప మండలి ఎన్నికల కోసం జెడిఎస్-బిజెపి పొత్తు కోసం ఒక ప్రణాళికను రూపొందిస్తారని ప్రకటించారు. 

అంతకు ముందు, నవంబర్ 4న, జేడీఎస్ భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేకంగా 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కోసం బిజెపి-జేడీఎస్ బంధం అవసరమని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.

75 మంది సభ్యుల కౌన్సిల్ నుండి 15 మంది కాంగ్రెస్ సభ్యులు, ఆరుగురు బిజెపి సభ్యులు, నలుగురు జెడిఎస్ సభ్యులు జనవరి 2022లో పదవీ విరమణ చేయనున్నందున డిసెంబర్ 10న ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రస్తుతం బిజెపికి 32 స్థానాలు, కాంగ్రెస్‌కు 29,  జెడిఎస్ 12 స్థానాలు ఉన్నాయి. వీరుగాక ఒక స్వతంత్ర సభ్యుడు, జేడీఎస్ కు చెందిన మండలి చైర్మన్ ఉన్నారు. 

కాంగ్రెస్ ఖాతాలో నుండి కొన్ని సీట్లను తాము కైవసం చేసుకోవాలని బిజెపి, తమ సంఖ్యను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 25 సీట్లలో జేడీఎస్ ఆరుచోట్ల మాత్రమే పోటీ చేస్తుండడంతో బిజెపి- జేడీఎస్ అనధికారికంగా పొత్తు ఏర్పర్చుకున్నట్లు వెల్లడి చేస్తున్నది. 

శాసనమండలిలో మెజారిటీ కోసం బిజెపి చాలాకాలంగా ఎదురు చూస్తున్నది. ప్రస్తుతం కీలక బిల్లుల ఆమోదానికి జేడీఎస్ పై ఆధార పడవలసి వస్తుంది. అందుకనే సొంతంగా ఆధిక్యతకోసం జేడీఎస్ తో అవగాహనకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. 

“మేము అభ్యర్థులను నిలబెట్టిన ఆరు నియోజకవర్గాల్లో మూడు పార్టీల అభ్యర్థులు ఉన్నారు. మా వ్యక్తికి మద్దతు ఇవ్వాలని బీజేపీని అడగలేం. ఇతర చోట్ల కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయి.  భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జేడీఎస్ ఈ నియోజకవర్గాలపై నిర్ణయం తీసుకుంటుంది” అంటూ మారస్వామి చెబుతున్నారు.

గత ఫిబ్రవరిలో, కాంగ్రెస్‌కు చెందిన మండలి చైర్మన్ కె. ప్రతాపచంద్ర శెట్టిని తొలగించే విషయంలో బిజెపి,  జెడిఎస్ కలసి వ్యూహాత్మకంగా పనిచేసాయి. ఆ స్థానంలో జెడిఎస్ అభ్యర్థి బసవరాజ్ హొరట్టి ఎన్నిక కాగా,   బిజెపికి చెందిన ఎంకె ప్రాణేష్‌ను డిప్యూటీ చైర్మన్‌గా  ఎన్నికయ్యారు. 

ముఖ్యమంత్రి  పదవి చేపట్టిన కొద్దీ రోజులకు బొమ్మై దేవెగౌడ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బొమ్మై రాజకీయ నేపధ్యం   మాజీ జనతా పరివార్ కావడంతో జేడీఎస్ బిజెపికి దగ్గరవుతున్నాయనే ఊహాగానాలు రాజకీయ వర్గాలలో చెలరేగుతున్నాయి. 

“మాది ప్రాంతీయ పార్టీ. మేము మనుగడ కోసం మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. ఒకప్పుడు బీజేపీతో పొత్తు, మరో సందర్భంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాము. మాకు రెండు వైపుల అనుభవం ఉంది. వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోరాడాలని, కర్ణాటక రాష్ట్రం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాం’ అని బొమ్మైతో భేటీ అనంతరం దేవెగౌడ చెప్పారు.

గత డిసెంబర్ లో జేడీఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నట్లు వెలువడిన కథనాలను కొట్టిపారవేస్తూ,  అంశాల ఆధారంగా తమ రెండు పార్టీలు కలసి పనిచేసే అవకాశం ఉన్నట్లు ఎడ్డియూరప్ప, కుమారస్వామి ప్రకటించారు. 2018లో తాను కాంగ్రెస్ తో కాకుండా బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన్నట్లయితే తాను ఇప్పుడు మెరుగైన రాజకీయ పరిస్థితులలో ఉండేవాడినని ఈ మధ్య ఒకసారి కుమారస్వామి పేర్కొన్నారు. 

జేడీఎస్ కు కీలక మద్దతు దక్షిణ కర్ణాటకలో ఉండడం, బిజేపికి ఉత్తర కర్ణాటకలో ఉండడం రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో రాజకీయంగా విరుద్ధ ప్రయోజనాలు ఏర్పడే అవకాశం లేదు. అయితే దక్షిణ కర్ణాటకలో జేడీఎస్ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ సవాల్ చేస్తూ ఉండడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయంగా అశనిపాతంగా మారింది. తమ పార్టీకి గల కీలక మద్దతును కాపాడుకోవడం కోసం విశేషంగా ప్రయత్నిస్తున్న కుమారస్వామి అందుకు కాంగ్రెస్ కన్నా బిజెపి అండ మేలు చేస్తుందని భావిస్తున్నారు.