ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో అసాధారణమేమీ కాదు

ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో బయటపడటం అసాధారణమేమీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆగేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో దేశాలన్నీ అనుసంధానమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నామని, దీంతో అన్ని దేశాలు కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. 

ఒమిక్రాన్‌ వేరియంట్‌లో ఉత్పరివర్తనాలు ఎక్కువగా ఉన్నాయని, అందులో కొన్ని ఆందోళనకరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మాస్క్‌, శానిటైజర్‌, శుభ్రంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌ఒ ఆగేయాసియా ప్రాంతంలో గుర్తించిన మొదటి రెండు కేసులు ఇవేనని ఆమె చెప్పారు. 

కాగా,  ప్రపంచంలో భారత్‌లోనే కరోనా కేసులు, మరణాలు తక్కువగా సంభవించాయని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు 3.46 కోట్ల కోవిడ్‌ కేసులు నమోదయ్యాయని, 4.6 లక్షల మంది మరణించారని లోక్‌సభలో ఓ ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్‌ మాండవీయ సమాధానమిచ్చారు.

ఇది మొత్తం కేసుల్లో 1.36 శాతం మాత్రమేనని అన్నారు.పది లక్షల జనాభాకు 25 వేల కేసులు, 340 మంది మరణించారని, ప్రపంచంలో అత్యల్ప సంఖ్యలో కేసులు, మరణాలు నమోదైందీ భారత్‌లో మాత్రమేనని పేర్కొన్నారు.