ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్రం లక్ష కోట్లకు పైగా

గత ఐదేళ్లలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి  కేంద్రం లక్ష కోట్లకు పైగా ఆమోదం తెలిపిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చెప్పారు. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఉత్త‌రాఖండ్‌లో శ‌నివారం రూ 18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌ధాని ప్రారంభోత్స‌వాలు, శంకుస్ధాప‌న‌లు చేశారు.

 రూ 8300 కోట్లతో చేప‌డుతున్న ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక‌న‌మిక్ కారిడార్ స‌హా ప‌లు ప్రాజెక్టుల పురోగ‌తిని ప్ర‌ధాని ప‌రిశీలించారు. డెహ్రాడూన్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన ర్యాలీలో ప్ర‌సంగించ‌డం ద్వారా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌లకు బీజేపీ ప్ర‌చారాన్ని ప్రారంభించారు.

రూ 18,000 కోట్ల‌తో త‌ల‌పెట్టిన ప్రాజెక్టులు త‌దుప‌రి ద‌శాబ్ధం ఉత్త‌రాఖండ్‌దేన‌ని చాటిచెబుతాయ‌ని ప్రధాని తెలిపారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వే పూర్త‌యితే రెండు న‌గ‌రాల మ‌ధ్య దూరం 248 కిలోమీట‌ర్ల నుంచి 180 కిలోమీట‌ర్ల‌కు త‌గ్గుతుంద‌ని పేర్కొన్నారు. బీజేపీ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున జాతీయ రహ‌దారుల‌ను నిర్మిస్తోంద‌ని చెప్పారు. 

మన పర్వతాలు, సంస్కృతి కేవలం మన విశ్వాసానికి సంబంధించిన అంశాలే కాకుండా దేశ భద్రతకు పెట్టని కోటలని ప్రధాని కొనియాడారు. పర్వత ప్రాంతాల్లో నివసించే వారు సులభంగా జీవనయానం సాగించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వారు ఇందుకు సంబంధించి ఎలాంటి విధానపరమైన వ్యూహం రూపొందించడపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

2007 నుంచి 2014 మధ్య కాలంలో ఉత్తరాఖండ్‌లో రూ.600 కోట్లతో కేవలం 288 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం జరుపగా, తమ ప్రభుత్వం 7 ఏళ్ల పాలనలో ఉత్తరాఖండ్‌లో రూ .12,000 కోట్లతో 2,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం జరిపిందని ప్రధాని చెప్పారు. గత ప్రభుత్వం పర్వత సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో పని చేయలేదని విమర్శించారు. తాము ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ అమలు చేశామని, ఆర్మీకి ఆధునాతన ఆయుధాలు సమకూర్చామని, ఉగ్రవాదులకు దీటుగా జవాబిచ్చామని చెప్పారు.

ఉత్తరాఖండ్‌లో 3 వైద్యకళాశాలు ఏర్పాటు చేశామని, హరిద్వార్ మెడికల్ కాలేజీకి ఈరోజు శంకుస్థాపన చేశామని ప్రధాని చెప్పారు. రిషీకేష్‌లో ఇప్పటికే ఎయిమ్స్ సేవలు మొదలయ్యాయని, కుమావూలో శాటిలైట్ కేంద్రం ప్రారంభం కానుందని ప్రధాని వివరించారు. వ్యాక్సినేషన్‌లోనూ ఉత్తరాఖండ్ ముందుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు రాజకీయాల కోసం రాష్ట్రానికి ఉన్న పేరు చెడగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.  ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం వారి ఆటలు చెల్లవని తాను చెప్పదలచుకున్నానని పేర్కొన్నారు. ఇలా మాట్లాడే వారు గతంలో చేసిందేమీ లేదని అంటూ అలాంటి శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు.