దక్షిణాదిన రక్తపోటు, మధుమేహం వ్యాధులు అధికం 

భారతదేశంలో అన్ని ప్రాంతాలవారి కన్నా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు రక్తపోటు (బిపి), మధుమేహం (షుగర్‌) వంటి జీవనశైలి సంబంధ వ్యాధులతో ఎక్కువగా బాధపడుతున్నారని 2019-20 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) వెల్లడించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువమంది బిపితో బాధపడుతున్నారు. 

సిక్కిం, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హైపర్‌టెన్షన్‌ సమస్య అధికంగానే వుంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, గోవా, పశ్చిమ బెంగాల్‌ల్లో మరింతమంది పురుషులు, మహిళలు రక్తంలో అధిక చక్కెర స్థాయితో బాధపడుతున్నారు. 

ఇతర ప్రాంతాల్లో కన్నా రాజస్థాన్‌, యుపి, ఎంపి, జమ్మూ కాశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు చాలా తక్కువగా వున్నాయని సర్వేలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో బిపి ఎక్కువగా వున్న లేదా మందులు వాడుతున్న వారి శాతం సగటున 26.6శాతంగా వుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 22.7శాతంగా వుంది.

 ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత పురుషుల్లో ఈ సమస్య 32.5శాతంగా వుండగా, గ్రామీణ ప్రాంత పురుషుల్లో 27.5శాతంగా నమోదైంది. తెలంగాణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరికొంత ఎక్కువగా వుంది. పట్టణ ప్రాంతాల్లో 37.5శాతంగా వుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 29శాతంగా వుంది.

అదే మహిళల విషయానికొస్తే, మొత్తంగా పురుషులతో పోలిస్తే తక్కువమంది మహిళలే ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో హై బిపితో బాధపడే మహిళల సంఖ్య మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగానే వుంది. పట్టణ ప్రాంతాల్లో సగటు 23.6శాతంగా వుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 20.2శాతంగా నమోదైంది. 

ఆంధ్రలో పట్టణ ప్రాంతాల్లో 27.5శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 24.5శాతంగా వుంది. తెలంగాణాలో ఈ పరిస్థితి కొంచెం మారింది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు అదే పరిస్థితి వున్నా గ్రామీణంలో మాత్రం కొంచెం పెరిగి 29.5శాతానికి చేరింది. 

ఇక పురుషుల్లో మధుమేహంతో బాధపడే వారిని పరిశీలించగా, దక్షిణాది రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో సగటున 17.9శాతం మంది వుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 14.5శాతంగా వుంది. ఆంధ్రలో పట్టణ ప్రాంతాల్లో 25శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 20శాతంగా నమోదైంది. తెలంగాణాకు వస్తే వరుసగా 21.5శాతం, 16.5శాతంగా వుంది. 

మహిళల్లో షుగర్‌తో బాధపడేవారు పురుషుల కన్నా తక్కువగానే వున్నారు. అయితే తమిళనాడు, ఆంధ్రాల్లో వీరి సంఖ్య ఎక్కువగానే వుంది. ఆంధ్రాల్లో పట్టణ ప్రాంతాల్లో 23.5శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 18శాతంగా నమోదైంది.