
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు చౌకగా ఉన్నాయి. ధరలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్లిగడ్డలు ఆల్ ఇండియా రిటైల్, హోల్‌సెల్ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ.40.13 ఉందని, క్వింటాల్‌కు రూ.3215.92 ధర పలుకుతోందని పేర్కొంది.
భారీ వర్షాల కారణంగా అక్టోబర్ మొదటివారం నుంచి ఉల్లిపాయల ధరలు పెరగడం ప్రారంభించాయని.. ధరలను తగ్గించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొంది. .
దేశంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో గోదాముల్లో రికార్డు స్థాయిలో 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల వర్షాల కారణంగా ఉల్లిపాయల రవాణాకు అంతరాయం వాటిల్లడంతో మార్కెటులో వీటి ధర కిలోకు రూ.40కు పెరిగింది.
దీంతో ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ నిల్వ చేసిన ఉల్లిపాయల బఫర్ నుంచి విడుదల చేసింది. ఇందులో భాగంగా అడిగిన వారికి అడిగినట్లుగా బఫర్ నిల్వల నుంచి ఉల్లి సరఫరా చేస్తున్నారు.
నవంబర్ 2 వరకు హైదరాబాద్, దిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ, పట్నా, రాంచీ, గువాహటి, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, ముంబయి, ఛండీగఢ్, కోచి, రాయ్‌పుర్‌లాంటి ప్రధాన మార్కెట్లకు 1,11,376.17 మెట్రిక్ టన్నుల ఉల్లి సరఫరా చేశామని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లోని స్థానిక మార్కెట్లకూ అందించినట్లు చెప్పింది.
వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు రూ.21కే కిలో ఇవ్వడానికి సిద్ధమైందని, రిటైల్ మార్కెట్ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రవాణా ఖర్చులతో కలిపితే వచ్చే ధరకు (ల్యాండెడ్ ప్రైస్-వాస్తవ ధర) ఉల్లి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంది. ధరల స్థిరీకరణ నిధితో వినియోగ వ్యవహారాల శాఖ బఫర్ నిల్వలు నిర్వహిస్తోందని కేంద్రం పేర్కొంది.
2020 అక్టోబర్‌లో కూడా ఉల్లిపాయల ధరలు రెట్టింపు అయ్యాయి. అదే సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో అకాల వర్షపాతం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. రిటైల్ ధరలు మొదటగా ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కిలో ఉల్లిపాయల ధర రూ.35 నుంచి రూ.70కి పెరిగింది. ఆపై కిలో ధర వందరూపాయలకు చేరింది.
More Stories
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం
5జీ కోసం జియో లక్ష టవర్లు