క‌శ్మీర్‌లోయ‌లో శాంతికి భంగం క‌లిగిస్తే ఉపేక్షించం

క‌శ్మీర్ లోయ‌లో శాంతి, సామ‌ర‌స్యాల‌కు భంగం క‌లిగించే వారిని ఉపేక్షించే ప్ర‌స‌క్తే లేద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్ప‌ష్టం చేశారు. రాజ‌ధాని శ్రీ‌న‌గ‌ర్ అభివృద్ధికి వాగ్దానాల వ‌ర్షం కురిపిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌త్యేక శ్రద్ధ వ‌ల్లే జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి క‌ల్పించిన 370 అధిక‌ర‌ణాన్ని ర‌ద్దు చేయ‌గ‌లిగామ‌ని తెలిపారు. 

రెండేండ్ల‌లో శ్రీ‌న‌గ‌ర్‌కు మెట్రో రైలు స‌ర్వీసు అందుబాటులోకి తెస్తామ‌ని చెప్పారు. క‌శ్మీర్‌లోయ‌లో రెండో రోజు ఆదివారం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమిత్‌షా.. భ‌గ‌వ‌తీ న‌గ‌ర్‌లో జ‌రిగిన స‌భ‌లో మాట్లాడుతూ.. జ‌మ్ము విమానాశ్ర‌య విస్త‌ర‌ణ‌తోపాటు ప్ర‌తి జిల్లా కేంద్రానికి హెలికాప్ట‌ర్ సేవ‌లు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

క‌శ్మీర్‌లోయ‌లో మొద‌లైన అభివృద్ధిని ఎవ‌రూ నిలువ‌రించ‌లేద‌ని  అమిత్‌షా తేల్చి చెప్పారు. స్థానిక యువ‌కులు జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌గ‌తికి స‌హ‌క‌రిస్తే ఉగ్ర‌వాదాన్ని క‌ట్ట‌డి చేయొచ్చని భరోసా వ్యక్తం చేశారు.  అభివృద్ధి ప‌నుల‌కు విఘాతం క‌లిగించే శ‌క్తుల ఆట‌లు సాగ‌నివ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు.

కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత రూ 12వేల  కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతూ 2022  కల్లా  రూ  51వేల కోట్ల  పెట్టుబడులు రావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వీటితో ఐదు లక్షల మంది యువతకు ఉపాధి  లభిస్తుందని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. 

జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో నూతన శకం ప్రారంభమైనది చెబుతూ ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని రెండు ప్రాంతాలలో సమానంగా అభివృద్ధి జరుగుతోందని  హామీ ఇచ్చారు. రూ.210 కోట్లతో నిర్మించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)–జమ్మూ క్యాంపస్‌ను అమిత్‌ షా ప్రారంభిస్తూ “జమ్ముకు అన్వయం జరిగే అధ్యాయం ముగిసింది. ఎవ్వరు మీకు అన్యాయం చేయలేరు” అని చెప్పడానికే తాను వచ్చానని తెలిపారు.

 వాల్మికీలకు, పశ్చిమ పాకిస్థాన్ శరణార్ధులకు న్యాయం జరిగినదని, అటవీ హక్కుల రక్షణ చట్టంను అమలు పరచడం ద్వారా పహారీలు, గుజ్జర్లు, బకరావాలాలు వంటి గిరిజనులను న్యాయం జరిగినదని అమిత్ షా వివరించారు. 

జమ్మూకశ్మీర్‌ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని అమిత్‌ షా స్పష్టం చేశారు. సాధారణ పౌరులను ముష్కరులు హత్య చేస్తున్నారని, ఇలాంటి ఘోరాలకు చరమగీతం పాడుతామని చెప్పారు. ఆదివారం భగవతీ నగర్‌లో ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడు దశాబ్దాల పాటు ఇక్కడ పరిపాలన సాగించిన మూడు కుటుంబాలు ప్రజలకు చేసిందేమీ లేదని పరోక్షంగా కాంగ్రెస్, నేషనల్, కాన్ఫరెన్స్, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ)పై మండిపడ్డారు.

ఆయా పార్టీల పేర్లను ప్రస్తావింపకుండా కొందరు బిజెపి ఈ ప్రాంతానికి ఏమి చేసినదాని అడుగుతున్నారని, కానీ “ఇంతకాలం అధికారంలో ఉన్న మీరు జమ్మూ కాశ్మీర్ కు ఏమి చేశారు? అని నేను అడుగుతున్నాను” అంటూ ఎద్దేవా చేశారు. ఇంతకాలం ఏమి చేశారు వివరించామని ప్రజలు వారిని అడుగుతున్నారని చెప్పారు. 

ఈరోజు రూ.15,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, ఆ మూడు కుటుంబాలు కలిసి వారి మొత్తం పాలనా కాలంలో ఇలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు.  అమిత్‌ షా ఆదివారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో సంభాషించారు. 

మీ కుటుంబాల బాగోగులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్కగా చూసుకుంటుందని, ఎలాంటి ఆందోళన చెందకుండా దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. సరిహద్దులోని చిట్టచివరి కుగ్రామం మక్వాల్‌లో అమిత్‌ షా పర్యటించారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు గ్రామస్తులతో చెప్పారు.