ఆంధ్రా, ఒడిసా ప్రజల ఇలవేల్పు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నీలమణిదుర్గ ఆలయ ప్రహరీ, సింహద్వారం తొలగింపు పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రభుత్వ దుశ్చర్య అంటూ మండిపడుతున్నారు. ఆలయం వద్ద స్థానికులు ఆదివారం ఆందోళన చేపట్టారు.
నరసన్నపేట-పాతపట్నం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు శనివారం ఆకస్మికంగా యంత్రాలతో ఆలయ ప్రహరీతో పాటు సింహద్వారాన్ని తొలగించారు. దీంతో ఆలయ పరిసరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనికితోడు ఆలయానికి కూతవేటు దూరంలో ఆంజనేయ, వినాయక గుడులను సైతం తొలగించారు.
కనీసం విగ్రహాలను తరలించి, సంరక్షించేందుకు కూడా సమయం ఇవ్వలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. శనివారం రాత్రి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానికులు ఆదివారం ఆందోళన చేపట్టారు.
నీలమణిదుర్గ ఆలయంతో పాటు సమీపంలోని ఆంజనేయ ఆలయం వద్ద తొలగింపు ప్రక్రియను పరిశీలించిన రవికుమార్ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో నాలుగు అడుగులు తొలగించాల్సి ఉన్నా..15 అడుగులు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు.
రెండో వైపు విస్తరించి ఉంటే ఆలయానికి నష్టం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. కాగా.. కొవిడ్ నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ రవికుమార్, వెంకటరమణమూర్తితో పాటు 17మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

More Stories
మానవ సేవ దైవ సేవ అని చెప్పిన సత్యసాయి
పోలవరం నిర్మాణ తీరును పరిశీలించిన కేంద్ర బృందం
దిగ్బ్రాంతి కలిగిస్తున్న విజయవాడలో మావోయిస్టుల షెల్టర్ జోన్!