దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న ర‌జ‌నీకాంత్

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న ర‌జ‌నీకాంత్

సినీ ప‌రిశ్ర‌మ‌లో దాదాపు నాలుగు ద‌శాబ్ధాల‌కు పైగా సేవ‌లు అందించిన ర‌జ‌నీకాంత్ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేశారు. 

సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న ర‌జ‌నీకాంత్‌కి ఈ విశిష్ట గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఒకే ఏడాదిలో రజనీకాంత్‌, ఆయన అల్లుడు ధనుష్‌ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్‌స్టార్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. 

ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్‌ అసురన్‌ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. కాగా, ర‌జ‌నీకాంత్ కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో నిజంగానే సూపర్ స్టార్ అనిపించుకున్నారు ర‌జ‌నీకాంత్. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తలైవా.

అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లేముందు రజనీకాంత్‌ స్థానిక ఫోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఇలాంటి శుభతరుణంలో తన గురువు కె.బాలచందర్‌ లేకపోవడం ఎంతో బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. 

“దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప అవార్డు రావడం సినీ ప్రేక్షకులు, తమిళ ప్రజల ఆదరాభిమానాల వల్లే సాధ్యమైంది” అని తెలిపారు. అవార్డ్‌ను తన గురువు, స్నేహితులు, అభిమానులు, తమిళ ప్రజలు, తన సినీ కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ విషయం తెలుపుతూ ఆయన అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు. 

భారత సినీ పితామహుడుగా పేరుగాంచిన దాదా సాహెబ్‌ ఫాల్కే పేరు మీద ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో నడిగర్‌ తిలగం శివాజీ గణేశన్‌, దర్శక దిగ్గజం కె.బాలచందర్‌ వంటి వారిని ఈ పురస్కారం వరించింది. 

ఈ క్రమంలో గత 2019 సంవత్సరానికిగాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రకటించింది. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణ ఆంక్షల నేపథ్యంలో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం నేడు ఢిల్లీలో జరిగింది.

అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే: 
 
ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ పాపులర్‌ చిత్రం- మహర్షి
ఉత్తమ నటి -కంగనా రనౌత్‌ (మణికర్ణిక)
ఉత్తమ నటుడు- మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)
ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే
ఉత్తమ తమిళ చిత్రం-  అసురన్‌
ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్
ఉత్తమ దర్శకుడు- సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)
ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
ఉత్తమ గాయకుడు: బ్రి. ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’)
ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)
ఉత్తమ ఎడిటింగ్‌- నవీన్‌ నూలి (జెర్సీ)