
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, జిల్లా కార్యాలయాలు, టిడిపి నేతల ఇళ్లపై వైసిపి మూక దాడికి వ్యతిరేకంగా పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నిరసన దీక్ష చేపట్టారు. ”ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు” పేరుతో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటలపాటు చంద్రబాబునాయుడు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.
”రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యింది. దీనిలో పోలీసులు అంతర్భాగమయ్యారు. ప్రజాస్వామ్యం నశించింది. ప్రశ్నించినవారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూకదాడులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం” అని ఆయన స్పష్టం చేశారు.
దీక్షా శిభిరాన్ని ద్వంసం చేసిన ఫర్నీచర్ మధ్యలోనే ఏర్పాటు చేశారు. పలు జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు దీక్షకు మద్దతుగా పాల్గొన్నారు. దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే టీడీపీకి గుంటూరు అర్బన్ పోలీసుల నోటీసులు అందజేశారు.
మరోవంక, గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్‌ను టీడీపీ నేతలు గురువారం సాయంత్రం కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి ఆయన సమయం ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తదితరులు గవర్నర్ వద్దకు వెళ్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని చెబుతూ అక్కడున్న టిడిపి నేతలు, సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, కార్యాలయాన్ని ధ్వంసం చేశారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కుట్రతోనే పార్టీ కార్యాలయాలు, టిడిపి నేతల ఇళ్లపై దాడి చేశారని ఆయన మండిపడ్డారు.
కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికి పోయేలా దాడులకు తెగబడ్డారని చెబుతూ ఈ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, డిజిపి ప్రోద్బలంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందని పేర్కొంటూ దీనిని జీర్ణించుకోలేని వైసిపి ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తోందని మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. దీనిని నిలువరించాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి పౌరునిపై ఉందని మాజీ ముఖ్యమంత్రి పిలుపిచ్చారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అది అభిమానుల స్పందన
‘‘నన్ను తిట్టే బూతులు వినలేక, తట్టుకోలేక, బీపీ పెరిగిన అభిమానులు రాష్ట్రమంతా తెలుగుదేశంపై రియాక్షన్ చూపించారు’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి టిడిపి కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడులను పరోక్షంగా సమర్ధిస్తూ చెప్పారు. కనీసం దాడులను ఎక్కడా ముఖ్యమంత్రి ఖండించకపోవడం గమనార్హం.
‘‘నన్ను బూతులు తిడతారు. నేనూ ప్రతిపక్షంలో ఉన్నాను. కానీ ఏరోజూ ఇటువంటి మాటలు ఎవరూ మాట్లాడి ఉండరు’’ అని జగన్ చెప్పుకొచ్చారు.
కాగా, వైసీపీ అభిమానులు టీడీపీపై చూపించిన రియాక్షన్‌కు చంద్రబాబే బాధ్యత వహించి, క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చేతకాని దద్దమ్మలే బూతులు వాడతారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరతామని సజ్జల తెలిపారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!