కరోనా మహమ్మారితో స్తంభించిన దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకొంటూ ఉండడంతో పలు రంగాలలో ఉపాధి అవకాశాలు సహితం గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటి రంగంలో ఉద్యోగ నియామకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో నాలుగు దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఏకంగా లక్ష మంది ఉద్యోగులను హైర్ చేసుకున్నాయి. 2019-20తో పోలిస్తే ఈ నియామకాలు రెట్టింపు కాగా, కరోనా మహమ్మారి ప్రబలంగా ఉన్న 2020-21 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 13 రెట్లు అధికం.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలో నాలుగు ఐటీ కంపెనీలు కలిసి 1,02,234 మందిని రిక్రూట్ చేసుకున్నాయి. ఐటీ సేవలకు డిమాండ్ గణనీయంగా మెరుగుపడిందనేందుకు నూతన టెకీల నియామకం విస్పష్ట సంకేతమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
హైరింగ్ జోరు పెరగడంతో వలసల పర్వం కూడా ఊపందుకుంటుండగా నియామకాలను గతంలో ఎన్నడూ లేనంతగా కంపెనీలు ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ ఇప్పటివరకూ 19,998 మంది ఉద్యోగులను నియమించుకోగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 18,657 మందిని విధుల్లోకి తీసుకుంది.
విప్రో కొత్తగా 23,650 మందిని హైర్ చేసింది. ఇక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ నాలుగు దిగ్గజ కంపెనీలు కలిపి తాజా అంచనాల ప్రకారం 1,60,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నాయి. భారత్‌లో పనిచేస్తున్న టెకీల్లో 25 శాతం పైగా ఈ నాలుగు కంపెనీల్లోనే పనిచేస్తున్నారు.

More Stories
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు