ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి దిగజారిపోయిందని, రెండు కులాల మధ్య పోరాటం జరుగుతున్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకునే వారు ఎవరైనా సరే బద్ధ శత్రువులే అని స్పష్టం చేశారు.
రాజకీయ నేతలు తనకు శత్రువులు కారని చెప్పారు. ప్రపంచం మారాలని, సమాజం మారాలని కోరుకుంటామని పేర్కొంటూ ఏదైనా సరే అడుగుపెడితే తప్ప అనుభవం రాదని తెలిపారు. “గెలుస్తామా.. ఓడుతామా నాకు తెలియదు. నేను రాజకీయాల్లోకి వస్తుంటే భయపెట్టారు. మార్పు కోసం.. బలమైన సామాజిక మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చా. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా” అని పేర్కొన్నారు.
రాజకీయాల్లో మత ప్రస్తావన ఉండకూడదని స్పష్టం చేస్తూ కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయ్ అని చెప్పారు. కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ నాయకులు తనకు శత్రువులు కాదని, సమస్యలు మాత్రమే శత్రువలని చెబుతూ ఏ మతంపై దాడి జరిగినా ఖండిస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
తెలంగాణ ప్రజలు పిలిచే వరకు రాను
రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని పేర్కొంటూ తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై నుంచే జనసేన పార్టీని ప్రారంబించానని గుర్తుచేశారు. తెలంగాణ సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపించటానికి కృషి చేస్తానని ప్రకటించారు. తెలంగాణ పోరాట స్పూర్తి జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని గుర్తుచేశారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తి తన గుండెలో ధైర్యాన్ని నింపిందని తెలుపుతూ తెలంగాణ భాషను, యాసను తాను గౌరవిస్తున్నానని చెప్పారు. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేనకకు బద్దశత్రువులని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకులను తెలంగాణ నాయకులు బద్దశత్రువులుగా చూశారని విమర్శించారు.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!