వరుసగా మూడో నెలలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు జోరుగా రూ.1 లక్ష కోట్ల మార్క్ను దాటాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్లో జిఎస్టి వసూళ్లు రూ.1.17 లక్షల కోట్లు నమోదయ్యాయి. గత నెల వసూళ్లు ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వ్యాపారాలు మెరుగై ఆదాయం పెరుగుతోంది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో అత్యంత ఎక్కువ ఆదాయం ఉండనుందని అంచనా వేస్తున్నారు. 2020 సెప్టెంబర్లో జిఎస్టి వసూళ్లు రూ.95,480 కోట్లతో పోలిస్తే ఈసారి 23 శాతం పెరిగాయి. ఇక 2019లో రూ.91,916 కోట్లతో పోలిస్తే 27 శాతం పెరిగింది.
ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయిలో రూ.1.41 లక్షల కోట్ల వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ సెప్టెంబర్లో భారీగా వసూళ్లు వచ్చాయి. 2021 ఆగస్టు, జూలైలో వరుసగా జిఎస్టి వసూళ్లు రూ.1.12 లక్షల కోట్లు, రూ.1.16 లక్షల కోట్లు నమోదైనాయి.
సెప్టెంబర్లో వచ్చిన రూ.1.17 లక్షల కోట్ల జిఎస్టి వసూళ్లలో కేంద్రం జిఎస్టి రూ.20,578 కోట్లు ఉంది. ఇక రాష్ట్రాల జిఎస్టి రూ.26,767 కోట్లు, ఉమ్మడి జిఎస్టి వసూళ్లు రూ.60,911 కోట్లు ఉంది. ఉమ్మడి జిఎస్టిలో దిగుమతుల నుంచి వచ్చిన రూ.29,555 కోట్ల వసూళ్లు ఉన్నాయి. ఇంకా సెస్ రూ.8,754 కోట్లు ఉన్నాయి. సెప్టెంబర్లో దిగుమతి నుంచి వచ్చిన వసూళ్లు 30 శాతం పెరిగాయి.

More Stories
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘేల్ కుమారుడి ఆస్తుల జప్తు
అమెరికాలో ముగిసిన షట్డౌన్
నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ.. రూ.99 లక్షలు స్వాహా