ఇడి ముందుకు రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌ సోదరుడు

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సోదరుడు అగ్రసిన్‌ గెహ్లాట్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కేసులో ఆయనపై, మరికొంతమందిపై దర్యాప్తు జరుగుతోంది. ఎరువుల ఎగుమతుల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. 

మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద అగ్రసిన్‌ గెహ్లాట్‌ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసినట్లు తెలిపారు. ఉదయం 11.30 గంటల సమయంలో తన లాయర్‌తో కలిసి ఆయన ఇడి ముందు హాజరయ్యారు. ఈ కేసులో గతంలో కూడా ఆయన్ని విచారించారు. ఇడి చర్యల నుండి ఉపశమనం కావాలని కోరుతూ ఆయన రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించగా, దర్యాప్తునకు సహకరించాలని కోరింది.

గతేడాది జులైలో రాజస్థాన్‌లోని ఆయన వ్యాపార కేంద్రాలపై ఇడి దాడులు జరిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకునే ఇటువంటి చర్యలకు తాము భయపడేది లేదని పాలక కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ఈ కేసులో అగ్రసిన్‌ కుమారుడు అనుపమ్‌ కూడా విచారణను ఎదుర్కొన్నారు.

రైతులు ఉపయోగించే మ్యురియేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంఓపి) ఎగుమతిలో, సేకరణలో అవకతవకలు జరిగాయని 2007-09లో వచ్చిన ఆరోపణల ఆధారంగా పిఎంఎల్‌ఎ కింద క్రిమినల్‌ కేసు నమోదైంది. 2013లో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఖరారైంది. 

ఈ కేసులో కస్టమ్స్‌ ఎఫ్‌ఐఆర్‌, చార్జిషీట్‌ను ఇడి పరిగణనలోకి తీసుకుంది. ఎగుమతులు చేయడంపై ఆంక్షలు వున్న ఎంఓపిని మలేసియా, తైవాన్‌ల్లోని కొనుగోలుదారులకు ఇండిస్టియల్‌ సాల్ట్‌ల ముసుగులో విక్రయించడానికి సంబంధించిన కేసని ఇడి తెలిపింది.