ప్రపంచబ్యాంక్‌ తలుపులు తడుతున్న జగన్ ప్రభుత్వం

ప్రపంచబ్యాంక్‌ తలుపులు తడుతున్న జగన్ ప్రభుత్వం

ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్న వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం ప్రపంచబ్యాంక్‌ తలుపులు తడుతోంది. ప్రపంచ బ్యాంక్‌ అప్పంటే షరతులు ఉంటాయని, ప్రజలపై భారాలు మోపాల్సి ఉంటుందని తెలిసినా రాష్ట్రప్రభుత్వం విధిలేక ప్రపంచ బ్యాంక్‌ రుణాలు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 

ఈ ఏడాది ఇప్పటికే వివిధ మార్గాల్లో రూ 50 వేల కోట్లకు పైగా అప్పు చేసింది. పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణ ప్రభుత్వానికి భారంగా మారింది. బ్యాంకులు మొఖం చాటేస్తున్నాయి.  ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఆదాయాన్ని పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది.

పరిమితికి మించి అప్పులు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వంపై కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్‌, ఎడిబి, ఎఐఐబి రుణాలపూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులకు ఇన్‌పుట్‌లను, యంత్రాలను అందుబాటులోకి తెస్తానంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూసమగ్ర సర్వే చేపడుతోంది. రైతులకు నగదు బదిలీ చేస్తోంది. వ్యవసాయరంగంలో చేస్తున్న ఈ పనులను చూపించి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ నుంచి రుణం పొందాలని చూస్తోంది.

అలాగే విద్యా రంగంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్‌ నుండి రూ.1875 కోట్ల రుణాన్ని ఇప్పటికే తీసుకుంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా రంగంలో మార్పులు తేస్తున్నామని చెప్పి విద్యా రంగంలో మరిన్ని రుణాలను ప్రపంచ బ్యాంక్‌ నుంచి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తీసుకోబోతోంది.

వైద్య రంగంలోనూ మౌలిక వసతుల అభివృద్ది కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతున్నామని, దాని కోసం రుణాలను ఇవ్వాలని కూడా ప్రపంచ బ్యాంక్‌ను కోరుతోంది. వైద్య రంగంలో ప్రతి గ్రామంలోనూ ఒక క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయలను అంటే ఆపరేషన్‌ గదులను, వ్యాధి నిర్ధారణ పరీక్షల యంత్రాలను నెలకొల్పబోతున్నారు.

ఇటీవల కొత్తగా వైద్య కళాశాలల ఏర్పాటు చేస్తామంటూ చేసిన ప్రకటనను కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. వీటన్నింటికీ ప్రపంచ బ్యాంక్‌ నుంచి రుణం అడుగుతున్నారు. ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ నిర్దేశించే విధానాలు ప్రజలపై రకరకాల భారాలు మోపడానికి, కార్పొరేట్లకు రాష్ట్రంలోని విలువైన ప్రజల ఉమ్మడి ఆస్తులను, వనరులను కట్టబెట్టడానికి దారితీయడమే కాక  బడ్జెట్‌ లోటు నియంత్రణ పేరుతో ప్రభుత్వ వ్యవయం మీద ఆంక్షలు విధిస్తాయి. ఆ ఆంక్షల కారణంగా నవరత్నాల పథకాల కొనసాగింపుని ప్రశ్నార్ధకం కాగల ప్రమాదం ఏర్పడనున్నది.