మరోసారి అమెరికాకు పొంచిఉన్న అల్‌ ఖాయిదా ముప్పు!

ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదాన్ని అంతచేయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని అమెరికా ప్రకటించినప్పటికీ అమెరికాపై మరోసారి అల్‌ ఖాయిదా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడంతో తమ లక్ష్యం నెరవేరిందని అమెరికా ప్రకటించినప్పటికీ ఆ వాదన నిజం కాదని అమెరికా నిఘా సంస్థ హెచ్చరికలతో స్పష్టమైంది.

తాలిబన్ల సంరక్షణలో ఉన్న ఆఫ్ఘన్‌లో అల్‌ఖైదా పునర్‌ నిర్మించుకునే అవకాశం ఉందని, దీంతో రానున్న ఒకటి రెండేళ్లలో అమెరికాపై దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా నిఘా సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ ఒక ప్రత్యేక కథనాన్ని వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో వనరులను సమకూర్చుకునేందుకు అల్‌ఖైదా అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం.  ఒకటి, రెండేళ్లలో ఆ ఉగ్రవాద సంస్థ తిరిగి క్రియాశీలకంగా మారి అమెరికాను బెదిరించే స్థాయికి చేరే అవకాశముందని ఆ అధికారి పేర్కొన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

అటు సిఐఎ డిప్యూటీ డైరెక్టర్‌ డేవిడ్‌ కోహెన్‌ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆఫ్ఘన్‌లో అల్‌ఖైదా తన కార్యక్రమాలు ప్రారంభించిందని కోహెన్‌ తెలిపారు. అయితే నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ అవ్రిల్‌ హేయిన్స్‌ మాత్రం ఈ వాదన సరికాదంటూ కొట్టిపారేశారు. అమెరికాకు ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్‌ లేదని, యెమెన్‌, సోమాలియా, సిరియా ఇరాక్‌ దేశాలపై దఅష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఏడాది కాలంగా మరణించాడనుకున్న అల్‌ఖైదా అగ్రనేత ఐమన్‌ అల్‌- జవహరీ ఇటీవల ఒక వీడియోను విడుదల చేశాడు. జిహాదీ బఅందాల ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై నిఘా పెట్టిన ‘సైట్‌’ అనే ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ గతవారం విడుదల చేసిన ఒక వీడియోలో జవహరీ పలు అంశాలపై మాట్లాడారు. 9/11 దాడుల స్మారకదినం రోజునే ఈ వీడియో బయటకు రావడం సంచలనం రేపింది. 

ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. 2001 సెప్టెంబరు 11న అమెరికాపై అల్‌ఖైదా దాడి జరిపడంతో  అమెరికా అల్‌ఖైదా నిర్మూలనకు ఆఫ్ఘన్‌లో సైన్యాన్ని మోహరించింది. అక్కడ తాలిబన్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి పౌర ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. 2011లో పాక్‌లో దాగున్న ఒసామా బిన్‌ లాడెన్‌ను చంపింది.

ఆ తర్వాత కూడా ఆఫ్ఘన్‌లో కొనసాగుతున్న అమెరికా సైన్యం  ఇటీవల తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం చేసుకోవడంతో అక్కడి నుండి తరలిపోయాయి. దీంతో తాలిబన్లు తిరిగి ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ విజయం సాధించడం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల ఇతర తీవ్రవాద గ్రూపులకు ధైర్యాన్ని కలిగించవచ్చని ఇటీవల  ఐక్యరాజ్య సమితి  ఐరాసప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా హెచ్చరించారు.