గుజరాత్ సీఎం విజ‌య్ రూపానీ రాజీనామా

గుజరాత్ సీఎం విజ‌య్ రూపానీ రాజీనామా

గుజరాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌ ఆచార్య దేవ‌వ్ర‌త్‌కు త‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. విజ‌య్ రూపానీ 2016, ఆగ‌స్టు 7 నుంచి గుజ‌రాత్ సీఎంగా కొన‌సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఏడాది మాత్ర‌మే గ‌డువు ఉండ‌గా విజ‌య్ రూపానీ రాజీనామా చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తుంటే.. బీజేపీ కొత్త ముఖ్య‌మంత్రి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

విజ‌య్ రూపానీ గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఒక స‌భ‌లో ప్ర‌సంగిస్తూ ఆయ‌న కుప్ప‌కూలిపోయారు. గుజరాత్ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూపాని తెలిపారు. తన రాజీనామాతో  పార్టీలో  కొత్త నాయకత్వంకు అవకాశం లభింపగలదని చెప్పారు. 

మ‌రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌టం, విజ‌య్ రూపానీ ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో కొత్త ముఖ్య‌మంత్రిని నియ‌మించి, కొత్త ముఖ్య‌మంత్రి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది బీజేపీ ఆలోచ‌న‌గా రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.

 కాగా, తనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ణతలు తెలియజేస్తున్నట్లు రాజీనామా అనంతరం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ రూపానీ పేర్కొన్నారు. గతంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుండి ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొందారు. 

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని మోదీ ప్రభావంతోనే తిరిగి ప్రజావిశ్వాసం పొందగలమని ధీమా వ్యక్తం చేస్తూ, ఒక సాధారణ  పార్టీ కార్యకర్తగా పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా చేపడతానని స్పష్టం చేశారు.