యూఎన్ ఉగ్ర జాబితాలో ఉన్న వ్య‌క్తే ఆఫ్ఘ‌న్ ప్ర‌ధాని !

యూఎన్ ఉగ్ర జాబితాలో ఉన్న వ్య‌క్తే ఆఫ్ఘ‌న్ ప్ర‌ధాని !
ఆఫ్ఘన్‌ను స్వాధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మూడు వారల మేరకు సమాలోచనలు అనంతరం మంగళవారం తాతాల్కిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. తాలిబన్ల శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే సంస్థ ‘రెహ్బరీ షురా’ సంస్థ కొత్త ప్రభుత్వానికి ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ తాతాల్కిక ప్రధానిగా నియమించింది. 
 
 ఎక్కువ‌గా ఎవ‌రికీ తెలియ‌ని అఖుండ్‌ ఐక్య‌రాజ్య‌స‌మితి ఉగ్ర‌వాద జాబితాలో ఉన్నారు. అమెరికాకు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అయిన మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ ప్రధానిగా నియమితులయ్యారు. 2001లో ప్రసిద్ధి చెందిన బామియన్ బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేయమని ఆదేశాలు జారీచేసిన వ్యక్తి కావడం గమనార్హం. 
 
ఇంతకాలం అధ్యక్ష పదవిని అధిరోహస్తారని భావించిన ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఉప ప్రధానిగా, హక్కానీ నెట్‌వర్క్‌ చెందిన అబ్దుల్‌ సలామ్‌ హనీఫ్‌ మరో ఉప ప్రధానిగా పనిచేస్తారు. ఇంకో 30 మందితో కేబినెట్‌ మంత్రులు/సహాయ మంత్రులు, నిఘా విభాగం, సెంట్రల్‌ బ్యాంకు చీఫ్‌ల జాబితాను  తాలిబాన్ల అధికార ప్రతినిధి, సమాచార శాఖ సహాయ మంత్రిగా నియమితులైన జబియుల్లా ముజాహిద్‌ విడుదల చేశారు.
 
 తాలిబ‌న్ల లీడ‌ర్‌షిప్ కౌన్సిల్ రెహ‌బారీ షురాకు ఆయ‌న 20 ఏళ్ల పాటు నాయ‌క‌త్వం వ‌హించారు. కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు. 1996 లో ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
 
2001లో అమెరికాతో యుద్ధం ఆరంభం కావ‌డానికి ముందు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో మంత్రిగా చేశారు. మిలిట‌రీ నేత‌లా కాకుండా.. ఎక్కువ శాతం మ‌త‌ప‌ర‌మైన ఆదేశాలు ఇస్తుంటారు. తాలిబ‌న్ ఆధ్మాత్మిక నేత షేక్ హిబాతుల్లా అఖుండ్జాకు చాలా స‌న్నిహితుడు. తాలిబ‌న్లు పుట్టిన కాంద‌హార్ ఆయ‌న జ‌న్మ‌స్థ‌లం. సాయుధ పోరాటం చేప‌ట్టిన తాలిబ‌న్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో ఆయ‌న ఒక‌రు.
 
తాలిబన్‌ సహ వ్యవహస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరదార్‌, మౌలావి హనాఫీ డెప్యూటీ నేతలుగా ఉంటారని.. తాలిబన్‌ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. కొత్త ప్రభుత్వం రెహ్బరీ షురా సంస్థ అధిపతి ఆధ్వర్యంలో వ్యవహారాలన్నింటిని ప్రభుత్వం నడిపించనుంది.
 
అలాగే, సారాజుద్దీన్ హక్కానీని తాత్కాలిక ఇంటీరియర్‌ మంత్రిగా, తాలిబాన్ అధికార ప్రతినిధి అబాస్ స్టానిక్జాయ్ కొత్త ఆఫ్ఘన్ ప్రభుత్వంలో ఉప విదేశాంగ మంత్రిగా వ్యవహరించనున్నట్లు ముజాహిద్‌ తెలిపారు.  తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ కుమారుడు ముల్లా యాకూబ్ కొత్త ఆఫ్ఘన్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా నియామకమవగా.. అమీర్ ఖాన్ ముత్తాకీని విదేశాంగ మంత్రిగా నియమించినట్లు చెప్పారు.
 
తాత్కాలిక ప్రభుత్వంలో 20 సంవత్సరాలు పాటు, అమెరికా, దాని మిత్రదేశాలపై నిర్విరామంగా పోరాటం చేసిన వారికి తాలిబన్లు ప్రభుత్వంలో పెద్దపీట వేశారు.  మరోవైపు అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందంపై చర్చలు సాగించిన, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కేబినెట్‌లో ఉప ప్రధాని బాధ్యతలను అప్పగించారు.
 
తాము ప్రకటిస్తున్నది మధ్యంతర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని నియామకాలు ఉంటాయని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం ఎంత కాలం పనిచేస్తుంది అన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టంగా తెలిపారు. 
 
మరోవైపు అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా మంత్రివర్గంలో తాలిబన్లకే పెద్దపీట వేశారు. హక్కానీకి ప్రభుత్వంలో చోటు కల్పిస్తే తాలిబన్లతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే చేసిన హెచ్చరికను తాలిబన్లు పెడచెవిన పెట్టడమే కాకుండా ఆయనకే కీలకమైన హోంశాఖను కట్టబెట్టారు.
 
మంత్రివర్గం ఏర్పాటులో పాకిస్థాన్ ముద్ర స్ఫష్టంగా కనిపిస్తున్నది. కాందహార్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న వారు, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న హక్కహాని నెట్ వర్క్ కు సంబంధించిన వారే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 33 మందిలో 20 మంది వరకు వారే అని తెలుస్తున్నది. దోహా కేంద్రంగా అంతర్జాతీయంగా తాలిబాన్లకు మద్దతుగా దౌత్యం నెరుపుతూ, మద్దతు సమీకరిస్తున్న వారికి చెప్పుకోదగిన ప్రాధాన్యత లభించలేదు. 
 
మరోవంక, ఖతార్‌లో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తాలిబాన్లు తమ డిమాండ్లకు అంగీకరించారని, దేశం వీడాలనుకునే అఫ్ఘాన్లను, అమెరికా పౌరులను అనుమతిస్తారని చెప్పారు. బ్లింకెన్‌ ప్రకటన వెలువడిన గంటలోనే విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ తాలిబాన్లు హుకుం జారీ చేశారు. తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా అఫ్ఘాన్‌ నుంచి విదేశాలకు ప్రయాణాలపై నిషేధం ఉంటుందని ప్రకటించారు.