పంజ్‌షిర్‌పై ఎగిరిన తాలిబ‌న్ల జెండా!

పంజ్‌షిర్‌పై ఎగిరిన తాలిబ‌న్ల జెండా!

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో పంజ్‌షిర్ ప్రావిన్స్‌ను కూడా తాము గెలిచిన‌ట్లు తాలిబన్లు  ప్ర‌క‌టించుకున్నారు. ప్రావిన్షియ‌ల్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ముందు తాలిబ‌న్ నేత‌లు నిల్చున్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వారి వెనుకే తాలిబ‌న్ జెండా కూడా క‌నిపిస్తోంది. 

ఇన్నాళ్లూ తాలిబ‌న్ల‌ను తీవ్రంగా ప్ర‌తిఘ‌టించిన తిరుగుబాటు సేన‌లు.. మొత్తానికి త‌ల‌వంచాయి. ఈ యుద్ధంలో నార్త‌ర్న్ అల‌యెన్స్ క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ స‌లే మ‌హ్మ‌ద్‌ను కూడా తాము మ‌ట్టుబెట్టిన‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించుకున్నారు. అయితే తాలిబ‌న్లు చెబుతున్న‌ద‌న్నదంతా అబద్ధ‌మ‌నీ.. పంజ్‌షిర్ ఇంకా త‌మ ఆధీనంలోనే ఉన్న‌ద‌ని తిరుగుబాటు సేన‌లు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. 

 అఫ్గాన్ మాజీ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా స‌లేహ్ ఇంటిని డ్రోన్లతో తాలిబన్లు పేల్చేశారు. అయితే, అయన సురక్షితంగా అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. తాలిబన్లకు పాకిస్థాన్ లోని ఐఎస్ఐ, హక్కానీ నెట్ వర్క్స్ తోపాటు ఆల్ ఖైదా సహకరించినట్లు తెలుస్తోంది. నార్త‌ర్న్ అల‌యెన్స్ క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ స‌లే మ‌హ్మ‌ద్‌ను, పంజ్‌షీర్ దళాల అధినేత మసూద్ కీలక అనుచరుడు ఫహీం దష్టితోపాటు మరో ఐదుగురిని తాలిబన్లు కాల్చి చంపారు. 

కాగా, .అఫ్ఘాన్ తిరుగుబాటు దళాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో తమ గ్రూపులోని మరో సీనియర్ సభ్యుడైన జనరల్ అబ్దుల్ వుడోద్ జారా మరణించారని అఫ్ఘాన్ జాతీయ ప్రతిఘటన సోమవారం తెలిపింది.జనరల్ వుడోద్ పంజ్‌షీర్ నిరోధక నాయకుడు అహ్మద్ మసౌద్ మేనల్లుడు. అమృల్లా సలేహ్ ఇంటిపై హెలికాప్టర్ దాడి ఘటన తర్వాత అతను సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.

అఫ్ఘానిస్థాన్ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రతినిధి ఫాహిమ్ దష్తి మరణించినట్లు అఫ్ఘాన్ మీడియా నివేదించిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది.అఫ్ఘాన్ ప్రతిఘటనకు చెందిన ఫాహిం దష్టీ, జనరల్ అబ్దుల్ వుడోద్ జారాలు అమరులయ్యారని, వారి జ్ఞాపకం శాశ్వతంగా ఉంటుందని అఫ్ఘాన్ ప్రతిఘటన విభాగం పేర్కొంది.

కాగా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాలిబన్‌లకు సూచించినట్లు ఆఫ్ఘనిస్తాన్‌లోని నేషనల్‌ రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఆఫ్ఘన్‌ ( ఎన్‌ఆర్‌ఎఫ్‌ఎ) అధ్యక్షుడు అహ్మద్‌ మసూద్‌ ప్రకటించారు. శాంతిని నెలకొల్పేందుకు పంజ్‌షీర్‌, అండరాబ్‌లపై తాలిబన్లు దాడులతో పాటు సైనిక నిఘాను కూడా నిలిపివేయాలన్న షరతుతో పోరాటం నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ కూడా తాలిబ‌న్ల‌కు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పంజ్‌షిర్‌ను పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు తాలిబ‌న్ల అధికార ప్ర‌తినిధి జ‌బీహుల్లా ముజాహిద్ వెల్ల‌డించారు. గ‌త నెల 15నే ఆఫ్ఘ‌నిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోగా.. పంజ్‌షిర్ ప్రావిన్స్ మాత్ర‌మే వారిపై తిరుగుబాటు చేసిన విష‌యం తెలిసిందే. ఆ దేశ మాజీ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా స‌లేహ్ కూడా అక్క‌డి తిరుగుబాటుదారుల‌తో చేతులు క‌లిపారు. అయితే తాలిబ‌న్లు పంజ్‌షిర్‌పై దాడి చేసిన త‌ర్వాత అమ్రుల్లా దేశం విడిచి పెట్టి వెళ్లిపోయారు.