భవిష్యత్ మహమ్మారీలను ఎదుర్కొనే పరిశోధనలు జరగాలి

భవిష్యత్తులో ఇటువంటి మహమ్మారులు ఎన్ని ఎదురైనా వాటిపై సమర్థంగా పోరాడే విధంగా పరిశోధనలను ఉధృతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శాస్త్రవేత్తలకు సూచించారు. డిఆర్‌డిఓకు సంబంధించిన డీపస్‌కు చెందిన సుమారు 25 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు తనను కలుసుకున్న సందర్భంగా కరోనా మహమ్మారిపై డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్(దీపస్) శాస్త్రవేత్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషిని అభినందించారు. 

కరోనా మహమ్మారి వల్ల ఊహించని ఆరోగ్య సంక్షోభం ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై త్రీవ దుష్ప్రభావం చూపిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలు, వారి జీవనోపాధి ప్రభావితం అయ్యాయని పేర్కొన్నారు.

సార్స్ కోవ్ -2 నేపథ్యంలో ఈ మహమ్మారులు ఏ క్షణమైనా ముప్పిరిగొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆపత్కాలంలో దీపస్, డిఆర్‌డిఓకు చెందిన ప్రయోగశాలలు తక్షణమే స్పందించి కరోనాకు సంబంధించిన వైద్య చికిత్సా పరికరాలను తయారుచేయడంలో కృషిచేశాయని ఆయన ప్రశంసించారు.

కరోనా చికిత్స, నిర్వహణ కోసం వివిధ స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డిఐపిఎఎస్‌, ఇతర డిఆర్‌డిఒ ల్యాబ్‌లను ఆయన అభినందించారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సార్స్-కొవి-2 తదితర కొత్త వేరియంట్ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వాటిని సమర్థంంగా ఎదుర్కోవడానికి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలోడిఆర్‌డిఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి, దీపస్ డైరెక్టర్ రాజీవ్ వర్షిణి కూడా పాల్గొన్నారు.