తలనొప్పిగా పంజాబ్, చత్తీస్‌ఘర్‌ కాంగ్రెస్ కుమ్ములాటలు!

తలనొప్పిగా పంజాబ్, చత్తీస్‌ఘర్‌ కాంగ్రెస్ కుమ్ములాటలు!
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, చత్తీస్‌ఘర్‌ లలో అంతర్గత కుమ్ములాటలు అధిష్ఠానంకు తలనొప్పిగా మారాయి. ఈ రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చాలని పార్టీ ఎమ్యెల్యేలు, నాయకులు వత్తిడి తెస్తుండడంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు దిక్కు తోచడం లేదు.
కొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో తాను ఇష్టపడి ప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం అప్పగించిన నవజ్యోత్ సింగ్ సిద్దు స్వయంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను మార్చవలసిందే అంటూ తిరుగుబాటుకు సిద్ధం కావడం రాహుల్ గాంధీని ఇరకాటంలో పడవేస్తున్నది.
ఎన్నికల ముందు ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తి లేదని అధిష్ఠానం స్పష్టం చేసినా నలుగురు మంత్రులతో పాటు పలువురు ఎమ్యెల్యేలు అసమ్మతిని వీడనాడటం లేదు.  ఒకవైపు ఎన్నికల్లో వరుస ఓటమి, ఫిరాయింపులతో పార్టీ ప్రతిష్ట మసకబారుతుంటే, మరోవంక నేతల మధ్య భేదాభిప్రాయాలను సర్దుబాటు చేయలేక అధిష్టానం తలలు పట్టుకుంటున్నది.
చత్తీస్‌ఘర్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్‌ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. రాహుల్ పట్టుబట్టి పదవి కట్టబెట్టిన  ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ పై తిరుగుబాటు చేస్తున్నారు. అసమ్మతి నేత, మంత్రి టిఎస్‌. సింగ్‌ డియో లతో కలసి రాహుల్ సమావేశమైనా సర్దుబాటు చేయలేక పోతున్నారు.
 బఘేల్‌ సిఎంగా రెండున్నరేళ్ల పదవికాలం ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. దీంతో 2018 డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడేటపుడు బఘేల్‌, డియోలు ఇరువురు రెండున్నరేళ్లు సిఎంలుగా వ్యవహరిస్తారని అధిష్టానం పేర్కొందని,. నాయకత్ప మార్పు చేపట్టాల్సిందేనంటూ డియోతో పాటు ఆయన మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. డియోను సిఎంగా ప్రకటించకుంటే ఆయన పార్టీని వీడే అవకాశం ఉందని,  తన పట్టుదల  సాధించేవరకు వదిలిపెట్టరని డియో సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నారు.
 
పంజాబ్ లో నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు సలహాదారులుగా చేరిన ప్యారేలాల్‌ గార్గ్‌, మల్వీందర్‌ మలీ వాఖ్యలపై ముఖ్యమంత్రి అమరీందర్‌ మండిపడుతున్నారు.  భారత్‌, పాకిస్తాన్‌లు కాశ్మీర్‌ను చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్నాయంటూ మలీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఈ పోస్ట్‌పై కాంగ్రెస్‌ అధిష్టానం కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి.  నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు సలహాదారులను తొలగించాలని, లేకుంటే పార్టీ అధిష్టానమే తొలగిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ ఛార్జ్ హరీష్‌ రావత్‌ స్పష్టం చేశారు. అయినా సిద్దు లెక్కచేయడం లేదు.