అక్టోబ‌ర్‌లో పీక్ స్టేజ్‌కు కరోనా మూడో వేవ్

అక్టోబ‌ర్‌లో పీక్ స్టేజ్‌కు కరోనా మూడో వేవ్

కరోనా మూడో వేవ్ అక్టోబ‌ర్‌లో పీక్ స్టేజ్‌కు చేరుతుంద‌ని, ఇది పెద్ద‌ల‌తోపాటు పిల్ల‌ల‌పైనా ప్ర‌భావం చూప‌నుంద‌ని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన క‌మిటీ క‌రోనా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ నివేదికను ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యా(పీఎంవో)నికి స‌మ‌ర్పించింది.

దేశంలో పీడియాట్రిక్ (చిన్న పిల్ల‌ల వైద్యం) వ‌స‌తుల‌ను భారీగా పెంచాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని త‌న నివేదికలో తెలిపింది. డాక్ట‌ర్లు, సిబ్బంది, వెంటిలేట‌ర్లు, అంబులెన్స్‌ల వంటి వాటిని మెరుగుప‌ర‌చాల‌ని తేల్చి చెప్పింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న స‌దుపాయాలు అవ‌స‌రానికి ద‌రిదాపుల్లో కూడా లేవ‌ని ఈ క‌మిటీ చెప్పింది.

హోంశాఖ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేసే నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల క‌మిటీ క‌రోనా మూడోవేవ్‌కు సంబంధించి కీల‌క అంచ‌నాలు, సూచ‌న‌లు చేసింది. ఇక దీర్ఘ‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న పిల్ల‌లు, దివ్యాంగుల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఈ క‌మిటీ చెప్పింది. 

ఇప్ప‌టికే ఇండియాలోని డ్ర‌గ్ రెగ్యులేట‌ర్ 12 ఏళ్లు నిండిన చిన్నారుల కోసం జైకొవ్‌-డీ వ్యాక్సిన్‌కు అనుమ‌తి ఇచ్చినా.. ఈ డ్రైవ్ ఇంకా ప్రారంభం కాలేదు.  చిల్డ్ర‌న్ వ‌ల్న‌ర‌బిలిటీ అండ్ రిక‌వ‌రీ పేరుతో నిపుణుల క‌మిటీ రిపోర్ట్‌ను వెలువ‌రించింది.

అయితే వైర‌స్ వ‌ల్ల పిల్ల‌ల‌పై మ‌రీ ఎక్కువ ప్ర‌భావం ప‌డ‌క‌పోయినా, వాళ్లు ఇత‌రుల‌కు వ్యాపింప‌జేసే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ని కమిటీ తెలిపింది. ఇక దేశ‌వ్యాప్తంగా పీడియాట్రిక్ స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చ‌డంతోపాటు పిల్ల‌ల వెంట హాస్పిట‌ల్స్‌లో ఉండే గార్డియన్స్ సుర‌క్షితంగా ఉండేలా ప్ర‌త్యేక కొవిడ్ వార్డుల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని క‌మిటీ సూచించింది.

కాగా,   దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 32 వేల కేసులు నమోదవగా, తాజాగా 25 వేలకు తగ్గాయి. ఇది నిన్నటి కంటే 19 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా గతేడాది మార్చి తర్వాత యాక్టివ్‌ కేసులు భారీగా తగ్గాయని తెలపింది. ఇప్పటివరకు 58.25 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.