దేశానికి రాజైనా అంబర్ పేట బిడ్డనే  

దేశానికి రాజైనా అంబర్ పేట బిడ్డనే  
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జన ఆశీర్వాద యాత్ర హైదరాబాదులోని అంబర్ పేటకు చేరుకున్న సందర్భంగా కిషన్ రెడ్డిలో భావోద్వేగాలు పెల్లుబికాయి. అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత.. బిడ్డ తన తల్లి దగ్గరకు వచ్చినట్లుగా అనిపిస్తోందని ఆయన చెప్పారు. దేశానికి రాజైనా తాను అంబర్ పేట బిడ్డనే అని ఆయన స్పష్టం చేశారు. 
 
గతంలో ఇక్కడి ప్రజలు తన పట్ల చూపిన ఆదరణ తనను ముగ్ధుడ్ని చేసేదని చెప్పారు. తాను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానంటే అంబర్‌పేట అసెంబ్లీ, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలే కారణమని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన ఇక్కడి నుండి మూడుసార్లు శాసనసభకు ఎన్నిక కావడం గమనార్హం.
“నాడు నేను బస్తీలు తిరిగేటప్పుడు ఇక్కడి అమ్మలు, చెల్లెమ్మలు నన్ను సాదరంగా స్వాగతించేవాళ్లు. ఇప్పుడా ఆనందంలేదు. ఇప్పుడు నన్ను కలిసేందుకు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కార్లలో వస్తుంటారు. కానీ, అంబర్ పేటలో ఉండే ఆనందం మాత్రం నాకు రాదు” అని తెలిపారు. 
 
“అయితే, ఇవాళ నాకు దేశానికి సేవ చేసే అవకాశం వచ్చింది. అందుకు కారణం అంబర్ పేట, సికింద్రాబాద్ ప్రజలే. మీరు, నరేంద్ర మోదీ గారు ఇచ్చిన అవకాశంతోనే నేను ఢిల్లీ వరకు వెళ్లాను. అంబర్ పేట బిడ్డగా మీరు గర్వపడేలా పనిచేస్తా. మీకు మంచిపేరు తెచ్చేలా పనిచేస్తా” అని  ఇచ్చారు. 
 
ఇవాళ తాను మూడు శాఖలకు కేంద్రమంత్రిగా ఉన్నానని, గతంలో అమిత్ షాకు సహాయమంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. “కానీ ప్రధాని నరేంద్ర మోదీ… నువ్వు సహాయకుడిగా కాదు, నీకే మూడు శాఖలు ఇస్తున్నాని నన్ను కేంద్రమంత్రిని చేశారు. ఒక సహాయమంత్రిగా ఉన్న నాకు ఇవాళ మోదీ గారు ఐదుగురు సహాయ మంత్రులను ఇచ్చారు. దేశంలో అత్యధిక సహాయ మంత్రులను కలిగి ఉన్నది మీ అంబర్ పేట్ బిడ్డకే” అంటూ భావోద్వేగంతో  ప్రసంగించారు. 
 
 కాగా, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.  ‘‘తెలంగాణలో కల్వకుంట్ల పరిపాలనను తరిమికొడదాం. బీజేపీ నాయకత్వంలో ధర్మంతో కూడిన పాలన తెలంగాణ ప్రజలకు లభించబోతోంది” అంటూ స్పష్టం చేశారు. 
 
 “ఏడేళ్ళుగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారు. సచివాలయం లేని రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. సచివాలయానికి వెళ్లడం ఇష్టంలేకనే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చివేశారు” అంటూ ధ్వజమెత్తారు. డిసెంబరు నాటికి దేశంలో అందరకీ వ్యాక్సిన్ ఇస్తామని చెబుతూ హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు కావటంలో కేంద్రం పాత్ర కీలకం అని తెలిపారు.