మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఇస్తే రూ.5 లక్షల రివార్డు అందజేస్తామని సిబిఐ ప్రకటించింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన ఇచ్చింది.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఫోన్ నంబర్ల ద్వారా కానీ, కార్యాలయంలో గానీ తమను సంప్రదించి వివరాలు తెలుపవచ్చని పేర్కొంది. దాదాపు ఏడాది నుంచి ఈ కేసుపై విచారణ చేస్తున్న సిబిఐ అనేక మంది అనుమానితులను ఇప్పటికే పలు దఫాలుగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
మరోవైపు 76వ రోజు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. శనివారం విచారణకు వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన ఇదాయతుల్లా హాజరయ్యారు.
హత్య జరిగిన రోజు ముందుగా వివేకా మృతదేహానికి ఇదాయతుల్లానే ఫొటోలు తీసినట్లు గుర్తించారు. అందులో భాగంగానే సిబిఐ అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన విజయశంకర్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు.

More Stories
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
అమరావతికి ప్రపంచ బ్యాంకు మరో రూ 1700 కోట్లు