
మేడ్చల్ మల్కాజిగిరిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టిఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య మాటామాటా పెరగటంతో బిజెపి కార్పొరేటర్ శ్రవణ్‌పై టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్పొరేటర్ శ్రావణ్‌ను ఆస్పత్రికి తరలించారు.
స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ దాడి జరగడంతో స్వాతంత్య్ర వేడుకలు రణరంగంగా మారాయి. మల్కాజిగిరిలో చోటుచేసుకున్న ఈ ఘటన.. పోలీస్ కేసుల వరకు, ఆపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసేవరకూ వెళ్లింది.
ఆదివారం మల్కాజిగిరి మునిసిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతోపాటు స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్, ఆ పార్టీ నాయకులు కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లిని శ్రావణ్ మర్యాదపూర్వకంగా పలకరించగా.. ఆయన కార్పొరేటర్ భుజంపై చేయి వేశారు.
ఆ వెంటనే టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, నాయకులు శ్రావణ్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో శ్రావణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అడ్డువచ్చిన బీజేపీ కార్పొరేటర్లు, నాయకులపైనా టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
దీంతో బీజేపీ నాయకులు మల్కాజిగిరి చౌరస్తా వద్దకు వెళ్లి, రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే మైనంపల్లిపై, టీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే మైనంపల్లి, టీఆర్‌ఎస్ నాయకులు కూడా అక్కడికి వచ్చి ధర్నాకు దిగారు. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
‘‘ఏరా శ్రావణ్.. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు‘’ అంటూ మైనంపల్లి తన భుజాన్ని గట్టిగా నొక్కారని, ఆపై చేయి చేసుకున్నారని, ఆ వెంటనే ఆయన అనుచరులు దాడి చేశారని కార్పొరేటర్ శ్రావణ్ తెలిపారు. బీరు బాటిల్ పగలగొట్టి పొడిచారని చెప్పారు.
గతంలో ఎమ్మెల్యే అవినీతిపై, ఆయన అనుచరుల అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షగట్టారన్నారు. కాగా, కార్పొరేటర్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్యే మైనంపల్లి, ఆయన అనుచరులు 15 మందిపై 307, 323, 324, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్ శ్రావణ్‌ను పార్టీ నాయకురాలు విజయశాంతితో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి అవినీతిని, అక్రమాలను బయటపెడతామని స్పష్టం చేసారు.
కాగా, ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాశ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల మైనంపల్లి క్షమాపణలు చెప్పాలని కోరారు.
మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ మల్కాజిగిరిలో అడుగు పెడితే గుండు పగులుద్దని అంటూ అనుచితంగా పేర్కొన్నారు. కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎంపీకి తక్కువైన ఆయనా.. మా అవినీతిని బయటపెట్టేది? అంటూ ఎద్దేవా చేశారు.
టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మైనంపల్లి ఓ రాజకీయ గూండా అంటూ సంజయ్ ధ్వజమెత్తారు. అందుకే గతంలో ఆయన బిజెపిలో చేరాతానంటే చేర్చుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఎల్‌ఎ, అయన ఆనుచరులు గుండాల్లా వ్యవహరిస్తూ దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. కార్పొరేటర్ శ్రవణ్‌ను బీరు బాటిళ్లతో కొట్టడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు చేసిన ఫిర్యాదును కేంద్రం సీరియ్‌సగా తీసుకున్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి మైనంపల్లి ఇంటి వద్ద దళితమోర్చా మహిళలపై దాడి జరిగిన నేపథ్యంలో.. త్వరలో ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఒక ఎస్‌ఐ కూడా వారిపై దాడి చేశారని బీజేపీ నాయకులు ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు మైనంపల్లి సహా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భూకబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాంటూ బీజేపీ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నేడు బీజేపీ నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు బంద్ పాటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ప్రకటన చేశారు.
More Stories
కరూర్ తొక్కిసలాట వెనుక కుట్ర… బిజెపి ఆరోపణ
అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు