బీజేపీలో చేరిన సినీ నటి కరాటే కళ్యాణి

బీజేపీలో చేరిన సినీ నటి కరాటే కళ్యాణి

నటి కరాటే కళ్యాణి బిజెపి పార్టీలో చేరారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.  ఆమెతో పాటు మరికొందరు సినీన‌టులు కూడా బీజేపీలో చేరారు. అలాగే, జల్పల్లి కౌన్సిలర్ యాదయ్యతో పాటు ప‌లు పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరారు. వారంద‌రినీ రాష్ట్ర బీజేపీ నాయ‌కులు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కురాలు విజయశాంతి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాల‌న‌ రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని మండిప‌డ్డారు. తెలంగాణ బీజేపీ చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బీజేపీలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా వంటి ఎందరో సమర్థ‌వంత‌మైన నేత‌లు ఉన్నార‌ని చెప్పారు. 

తెలంగాణ‌లో సంజయ్ వంటి నేత ఉన్నార‌ని ఆమె చెప్పారు. రాష్ట్ర‌ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు ఆయ‌న‌ పాదయాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. ఆయ‌న‌ పాదయాత్ర విజ‌య‌వంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ రాబందు అని, అలాంటి నేత నోటి నుంచి దళిత బంధు మాట వస్తే ఎవరూ నమ్మరని ఈ సందర్భంగా సంజయ్ ధ్వజమెత్తారు. హుజూర్‌నగర్‌, సాగర్‌, జీహెచ్‌ఎంసీ, దుబ్బాక ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఎన్ని హామీలు ఇచ్చారో, తర్వాత వాటిని ఎలా మరచిపోయారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. హుజూరాబాద్‌ ఎన్నిక తర్వాత దళిత బంధు ఊసే ఉండదని స్పష్టం చేశారు.

‘‘అగ్గిపెట్టె మంత్రి (హరీశ్‌రావు) ఒకాయన మాట్లాడుతూ, దళితులకు బండి సంజయ్‌ రూ. 40లక్షలు ఇవ్వాలని అంటుండు.. ఎందుకియ్యాలి? నువ్విచ్చే రూ.పది లక్షలు నీ అయ్య సొమ్మా? లేక నోట్లను ముద్రించి ఇస్తున్నవా? ” అంటూ సంజయ్ ప్రశ్నించారు. 

దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని హామీలు గాలికి వదిలేసినవ్‌.. అవన్నీ కలిపితే ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు వచ్చేవి. మరి ఆ డబ్బులెందుకు ఇయ్యవ్‌? అంటూ నిలదీశారు. హుజూరాబాద్‌లో ఏ సర్వే చేసినా బీజేపీయే గెలుస్తుందని తేలడం తో సీఎం కేసీఆర్‌కు నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేసారు.