ఆగ‌స్టు 14 ఇక నుంచి విభ‌జ‌న స్మృతి దినం

ఆగ‌స్టు 14 ఇక నుంచి విభ‌జ‌న స్మృతి దినం

ఆగ‌స్టు 14వ తేదీని ఇక నుంచి విభ‌జ‌న స్మృతి దినంగా  గుర్తించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇవాళ ప్ర‌క‌టించారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. దేశ విభ‌జ‌న వ‌ల్ల క‌లిగిన బాధ‌ల‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని ప్ర‌ధాని చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఆగస్టు 15న జరుపుకుంటున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేశారు. 

ల‌క్ష‌లాది మంది మ‌న సోద‌ర‌సోద‌రీమ‌ణులు చెల్లాచెదుర‌య్యార‌ని, మ‌తిలేని ద్వేషం, హింస వ‌ల్ల వేలాది మంది మ‌ర‌ణించార‌ని, వారి క‌ష్టాలు, త్యాగాల‌కు గుర్తుగా ఆగ‌స్టు 14వ తేదీన విభ‌జ‌న భ‌యాన‌క‌ స్మృతి దినంగా పాటించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. దేశ విభ‌జ‌న వ‌ల్ల ప్ర‌జ‌ల్లో సామాజిక విభ‌జ‌న‌లు వ‌చ్చాయ‌ని, సామ‌ర‌స్యం లోపించింద‌ని, ఆ విష బీజాలను పార‌ద్రోలేందుకు పార్టిష‌న్ హార‌ర్స్ రిమెంబ్రెన్స్ డే నిర్వ‌హించాల‌ని మోదీ పిలుపిచ్చారు. 

మరొక ట్వీట్‌లో, సామాజిక విభజనలు, అసమతౌల్యం, అపశ్రుతుల విషాన్ని తొలగించవలసిన అవసరం ఉందని ‘భయానక విభజన గాయాలు గుర్తుకొచ్చే రోజు’ మనకు నిరంతరం గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సమైక్య భావన, సాంఘిక సామరస్యం, మానవ సాధికారతలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.

భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు దేశాల విభజనను గుర్తుచేసుకోవడం ద్వారా, ‘సామాజిక విభజనల విషాన్ని తొలగించాల్సిన’ అవసరాన్ని భారతీయులు గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

75 వ స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా  ప్రధాని ప్రకటన చేసిన వెంటనే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేస్తూ, “ఆగస్ట్ 14 ను #పార్టిషన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డేగా పాటించాలని ఆదరణీయ ప్రధాని శ్రీ @నరేంద్రమోదీ జీ చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. మన స్వాతంత్య్రాన్ని మనం జరుపుకున్నప్పటికీ, విభజన బాధితులను మర్చిపోకూడదు. ఇప్పటి నుండి, మనం  ఈ రోజును వారి జ్ఞాపకార్థం అంకితం చేస్తాము” అని పేర్కొన్నారు.

దేశ విభజన జరిగి భారత్, పాకిస్థాన్ లుగా రెండు దేశాలుగా ఏర్పడిన ఫలితంగా పశ్చిమ, తూర్పు రెండు వైపులా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. (తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్). చరిత్రకారులు ‘మానవ చరిత్రలో అతిపెద్ద రాజకీయ వలసలు’ అని వర్ణించిన వ్యక్తుల కదలిక దాదాపు 15 మిలియన్ల మందిని తమ ఇళ్ల నుండి నిర్వాసితులను చేసింది. 

మతపరమైన అల్లర్లలో కనీసం ఒక మిలియన్ మంది హత్య చేయబడినందున ఇది అత్యంత హింసాత్మక మానవ వలసలలో ఒకటి. అయితే, తూర్పు వైపున, పశ్చిమ బెంగాల్‌లోని నోఖాలీ,  బీహార్‌లో పెద్ద ఎత్తున హింస జరిగింది.

మ‌రోవైపు ఇవాళ పాకిస్థాన్ త‌న స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న‌ది. ఈ నేప‌థ్యంలో అత్తారి-వాఘా బోర్డ‌ర్ వ‌ద్ద పాకిస్థాన్ రేంజ‌ర్లు, బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ స్వీట్లు పంచుకున్నారు. రేపు కూడా వాళ్ల‌కు స్వీట్లు ఇవ్వ‌నున్న‌ట్లు బీఎస్ఎఫ్ క‌మాండెండ్ జ‌స్బీర్ సింగ్ తెలిపారు.