క్రీడలు, ఫిట్ నెస్ తోనే భారత్ కు పతకాలు

క్రీడలు, ఫిట్ నెస్ తోనే భారత్ కు పతకాలు
క్రీడలు, ఫిట్‌నెస్ పై ఈశాన్య రాష్ట్ర యువతకు ఉన్న ఆసక్తితోనే  భారతదేశానికి పతకాలు వస్తున్నాయని  ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి  కిషన్ రెడ్డి తెలిపారు.    ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డోనర్) కి మంత్రి కాకముందే తాను ఈ ప్రాంతాన్ని సందర్శించానని, అప్పుడే ఈ రాష్ట్రాల యువతకు క్రీడలపై ఉన్న ఆసక్తి అర్ధమైందని ఆయన పేర్కొన్నారు. 
 
ఇప్పుడు లోవ్లినా బోర్గోహైన్ రూపంలో టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి కనీసం రజత పతకం వస్తుందని తెలిసి గర్విస్తున్నానని ఆయన తెలిపారు. ఇది  ప్రతి అస్సామీకి మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికి కూడా  సంతోషకరమైన క్షణమని ఆయన చెప్పారు.
 
గోలఘాట్ జిల్లాలోని బారోముఖియా గ్రామానికి చెందిన ఒక యువతి టోక్యో ఒలింపిక్స్‌లోని పోడియంపై పతకం అందుకోబోతుండటంపై కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. లోవ్లినా పోరాట పటిమ , ఆత్మస్ధైర్యం అందరికీ తెలిసిందేనని,  కరోనాను జయించి లాక్డౌన్ సమయంలో గ్యాస్ సిలిండర్‌తో లవ్లినా శిక్షణపొందడం మనలో చాలా మంది చూశామని ఆయన పేర్కొన్నారు. 
 
ఇటువంటి నారీశక్తీనే మనం మార్గదర్శకంగా తీసుకుని అభినందించాలని ఆయన తెలిపారు.  వచ్చే వారం భరతమాత ముద్దుబిడ్డ లోవ్లినా సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో పిడి గుద్దులు కురిపిస్తున్న వేళ భారతీయులందరు ఆమెను ఖచ్చితంగా ఉత్సాహపరచాలని ఆయన సూచించారు. ఇద్దరు అద్భుతమైన, అలుపెరగని మహిళల కారణంగా ఇప్పటివరకు సాధించిన రెండు పతకాలను గర్వాంగా మనందరం ఆస్వాదిద్దామని ఆయన పిలుపునిచ్చారు.