ఎర్ర కోట నుంచి ఏం మాట్లాడాలో చెప్పమని కోరిన మోదీ 

ఎర్ర కోట నుంచి ఏం మాట్లాడాలో చెప్పమని కోరిన మోదీ 
స్వాతంత్య్ర దినోత్సవాలనాడు ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో ప్రజల ఆలోచనలకు స్థానం లభించబోతోంది. ప్రధాన మంత్రి కార్యాలయం శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయని పేర్కొంది.
 
 ‘‘ఆగస్టు 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కోసం మీ ఆలోచనలు ఏమిటి? @mygovindia ద్వారా మీ ఆలోచనలు పంచుకోండి’’ అని కోరింది. MyGov.in పోర్టల్‌ ద్వారా కూడా ఈ పిలుపును ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ప్రసంగంలో తన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తారని తెలిపారు.
నాలుగేళ్ళ నుంచి నేరుగా ప్రజల ఆలోచనలు, సలహాలను కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ప్రజలు నవ భారతం కోసం తమ సలహాలను అందజేయాలని కోరారు. సలహాలకు అక్షర రూపం ఇచ్చి, తెలియజేయాలని కోరారు. ప్రజలు పంపించిన అంశాల్లో కొన్నిటిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తారని తెలిపారు. 

ఈ ట్వీట్ వచ్చిన కొద్ది క్షణాలకే జనం స్పందించడం ప్రారంభించారు. ట్విట్ట‌ర్ యూజ‌ర్ సుమీత్ మోహ‌తా ట్వీట్ చేస్తూ పాఠ‌శాల్లోని బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి టీకాలు వేయ‌డానికి ఒక మిష‌న్ ప్రోగ్రాంను ప్ర‌క‌టించాల‌ని సూచించారు. ఇది భవిష్యత్తుకు మీ అతిపెద్ద బహుమతి అవుతుందని పేర్కొన్నారు.

మరో ట్విట్టర్ యూజర్ ఆకాష్ సింగ్ స్పందిస్తూ.. జ‌నాభ పెరుగుద‌ల భార‌త్ అతిపెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో దేశ జనాభా 150 కోట్లకు చేరుతుంది. కావునా ఈ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఎర్రకోట నుండి జనాభా విస్ఫోటనం గురించి ఏదైనా చెప్పాల్సిందిగా అభ్య‌ర్థించారు.

మరొక ట్విట్ట‌ర్‌ వినియోగదారుడు అనుపమ్ రవి స్పందిస్తూ.. మీరు, మీ క్యాబినెట్ రెగ్యులర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వ‌హిస్తార‌ని హామీ ఇవ్వగలరా? ద్రవ్యోల్బణం, వస్తువుల ధరలను ఎలా నిర్వహించాలో ప్రభుత్వం యోచిస్తోంది? రిమోట్ విద్యను నిర్వహించడానికి పోస్ట్ కోవిడ్ ప్రపంచంలో ఏటువంటి మౌలిక సదుపాయాలు తీసుకోబ‌డ్డాయి వంటి అంశాల‌పై ప్ర‌సంగించాల్సిందిగా కోరాడు.

ఈ క్ర‌మంలో చాలా మంది నెటిజన్లు పెగాసస్ సమస్య, రాఫెల్ విచారణ, ఇంధన ధరల పెరుగుదల, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై మాట్లాడాల్సిందిగా అడిగారు. మ‌రో ట్విట్ట‌ర్ యూజ‌ర్ దీప‌క్ కుమార్ స్పందిస్తూ.. ద్ర‌వ్యోల్బనం, నిరుద్యోగిత‌, కొవిడ్ వ‌ల్ల భార‌త్‌లో నాలుగు ల‌క్ష‌ల మంది చ‌నిపోవ‌డం, స్లో వ్యాక్సినేష‌న్‌, అవినీతి, కొవిడ్ అనంత‌రం కూలీల జీవితాలపై ద‌య‌చేసి మాట్లాడాల్సిందిగా కోరారు.