
గుజరాత్‌లోని ధోలావీరాకు యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. హరప్పా నాగరికత కాలంనాటి ఈ నగరానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడంతో తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రణ్ ఆఫ్ కచ్‌లో ఉన్న ధోలావీరాను గతంలో తాను సందర్శించిన ఫోటోలను ఇప్పుడు ప్రధాని తన ట్విట్టర్‌లో ఈ సందర్భంగా పోస్టు చేశారు.
ఆయన ట్విటర్ వేదికగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తాను విద్యార్థిగా ఉన్నపుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఈ సుప్రసిద్ధ ప్రదేశాన్ని సందర్శించానని చెప్పారు. హరప్పా నాగరికత కాలంనాటి ధోలావీరా నగరానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు వచ్చినట్లు తెలుసుకుని చాలా సంతోషించానని మోదీ పేర్కొన్నారు.
ధోలావీరా చాలా ముఖ్యమైన అర్బన్ సెంటర్ అని తెలిపారు. మన గతంతో అనుసంధానంగల అతి ముఖ్యమైన వాటిలో ఇదొకటి అని పేర్కొన్నారు. ఇది తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశమని, మరీ ముఖ్యంగా చరిత్ర, సంస్కృతి, ఆర్కియాలజీలపై ఆసక్తిగలవారు తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశమని తెలిపారు.
తాను చదువుకునే రోజుల్లో ధోలావీరాను సందర్శించానని, మంత్రముగ్ధుడనయ్యానని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ధోలావీరా వారసత్వాన్ని కాపాడటానికి, పునరుద్ధరించడానికి కృషి చేసే అవకాశం తనకు లభించిందని చెప్పారు. ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
సింధూ లోయ నాగరికత విలసిల్లిన ప్రముఖ స్థలాల్లో ధోలావీరా ఒకటి. ఇది లోథాల్ కంటే పురాతనమైనది. కర్కాటక రేఖపై ఉన్న ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 2650 నుంచి నాగరికత విలసిల్లింది. ఈ ప్రాంతాన్ని 1967-68లో అప్పటి భారత పురాతత్వ సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ జేపీ జోషి కనుగొన్నారు. 1989 నుంచి తవ్వకాలు జరుపగా.. అబ్బురపరిచే వాస్తురీతి, పట్టణ ప్రణాళిక వెలుగులోకి వచ్చాయి.
జంతువుల ఎముకలు, బంగారం, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. సింధూ నాగరికతలోని మొహంజోదారో, హరప్పా తదితర ప్రాంతాల్లో ఇటుకలతో నిర్మాణాలు చేపట్టగా, ఇక్కడ మాత్రం అన్నీ రాతితో కట్టినవే. ఎడారి ప్రాంతం అయినందున ఆనాడు ప్రత్యేక పద్ధతుల్లో రాతితో నిర్మించిన తటాకాలు, కాల్వల ద్వారా నీటిని ఒడిసి పట్టారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం