
జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ప్రార్థనా స్థలాలకు నష్టం జరిగితే దేవుడు క్షమిస్తాడని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. కొందరికి ఇబ్బందులు కలుగకుండా దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దేశాభివృద్ధే లక్ష్యం అయినపుడు చిన్న చిన్న ఇబ్బందులను ప్రజలు పట్టించుకోకూడదని తెలిపింది.
కేరళలోని కొల్లం జిల్లాలో జాతీయ రహదారి కోసం భూ సేకరణను నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. కొల్లం జిల్లాలోని ఉమయనలోర్, తజుతల, దాని పరిసరాల్లోని గ్రామాల్లో ఎన్‌హెచ్-66 విస్తరణ కోసం భూ సేకరణను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. కొన్ని ప్రార్థనా స్థలాలను పరిరక్షించడం కోసం ఈ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని కేరళ ప్రభుత్వం సూచించిందని పిటిషనర్లు తెలిపారు. కానీ ఈ సలహాను నేషనల్ హైవే అథారిటీ పట్టించుకోలేదని తెలిపారు. మసీదును కాపాడటం కోసం రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని ఆరోపించారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, జాతీయ రహదారి కోసం ప్రతిపాదిత అలైన్‌మెంట్ వెంబడి నివాస భవనం, గుడి, మసీదు, శ్మశానం వంటివి ఉంటే, భూసేకరణ ప్రభావం వాటిపై పడటం, ప్రజా ప్రయోజనాల కోసం భూ సేకరణను ఉపసంహరించడానికి తగిన కారణం కాబోదని తెలిపింది.
ఈ సందర్భంగా ఓ ప్రముఖ మలయాళ రచయిత రాసిన సినిమా పాటను గుర్తు చేసింది. దేవుడు సర్వత్రా ఉంటాడని, దయామయుడని ఈ పాట సారాంశమని తెలిపింది. దేవుడు ఈ పిటిషనర్లను, అధికారులను, ఈ తీర్పునిచ్చిన న్యాయమూర్తిని అందరినీ కాపాడతాడని తెలిపింది. దేవుడు మనతోనే ఉంటాడని పేర్కొంది.
జాతీయ రహదారి వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని, అదేవిధంగా ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమని వివరించింది. మన దేశ అభివృద్ధి దృష్ట్యా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను ప్రజలు పట్టించుకోకూడదని తెలిపింది. నష్టపోయేవారికి తగిన నష్టపరిహారాన్ని చెల్లించేందుకు, పునరావాసం కల్పించేందుకు చట్ట ప్రకారం అవకాశాలు ఉన్నాయని వివరించింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్