
వరకట్నాన్ని రూపుమాపేందుకు విద్యార్థి దశ నుంచే చర్యలు ప్రారంభం కావాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సూచించారు. ఇందుకుగాను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందే సమయంలోనే విద్యార్థులు ‘కట్నం తీసుకోం’ అనే బాండ్ ఇచ్చేలా చూడటం సముచితంగా ఉంటుందని ఆయన తెలిపారు.
యాంటీ-ర్యాగింగ్ బాండ్ మాదిరిగానే ‘కట్నం తీసుకోం’ బాండ్‌పై విద్యార్థుల సంతకాలు తీసుకోవడం వల్ల వరకట్నం చావులను కొంతవరకైనా తప్పించవచ్చుననని పేర్కొన్నారు. యూనివర్శిటీ డిగ్రీలు కట్నం తీసుకునేందుకు లైసెన్సులు కాకూడదని కేరళ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్లతో సమావేశం అనంతరం ఆయన స్పష్టం చేశారు.
కేరళలో వరుసగా జరుగుతున్న వరకట్నం చావులపై సామాజిక అవగాహన కల్పించేందుకు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు చరమగీతం పాడేందుకు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఒకరోజు దీక్ష చేపట్టారు. అనంతరం కొల్లాం జిల్లాలో ఇటీవల వరకట్న వేధింపులతో చనిపోయిన ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ ఇంటికి వెళ్లి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపేందుకు విద్యార్థులు నడుం బిగించాలన్నారు. విద్యార్థులు యూనివర్శిటీ కోర్సుల్లో చేరడానికి ముందుగా ‘కట్నం తీసుకోం’ అనే బాండ్ ఇవ్వాలని చెప్పారు. యూనివర్శిటీల్లో యాంటీ డౌరీ బాండ్ తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ సుముఖంగా ఉన్నారని కేరళ విశ్వవిద్యాలయాల ఛాన్స్‌లర్ కూడా అయిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చెప్పారు.
వరకట్నం చావులు జరుగకుండా ఉండేందుకు ఎన్జీవోలు ప్రత్యేక ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. కట్నం ఇవ్వం, కట్నం తీసుకోం అనే ఉద్యమాన్ని యుద్ధప్రాతిపదికగా చేపట్టాలని గవర్నర్ ఇటీవల మహిళలకు విజ్ఞప్తి చేశారు.
వరకట్న నిబంధనల సవరణ
మరోవంక, వరకట్న నిషేధ నిబంధనలను కేరళ ప్రభుత్వం సవరించింది. 14 జిల్లాలుగల ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు వరకట్న నిషేధ అధికారులను నియమించేందుకు వీలు కల్పిస్తూ నిబంధనలను తీసుకొచ్చింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జి విడుదల చేసిన ప్రకటనలో, వరకట్న నిషేధ అధికారులను నియమించేందుకు వీలుగా నిబంధనలను సవరించినట్లు తెలిపారు.
ఈ అధికారులు ఇప్పటికే మూడు జిల్లాల్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం తిరువనంతపురం, ఎర్నాకుళం, కొజిక్కోడ్ జిల్లాల్లో వరకట్న నిషేధ అధికారులు ఉన్నారన్నారు. అన్ని జిల్లాల్లోనూ వరకట్న నిషేధ అధికారులను నియమిస్తామని చెప్పారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులు వరకట్న నిషేధ అధికారులుగా వ్యవహరిస్తారని చెప్పారు.
చీఫ్ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్‌గా మహిళా, శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరకట్న వేధింపుల కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులకు శిక్షణనిచ్చే కార్యక్రమం తొలి దశ పూర్తయిందని తెలిపారు. వరకట్న వేధింపులకు గురయ్యేవారు ఫిర్యాదు చేయడంలో సహాయపడటానికి ఆసక్తిగల స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానించిందని పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా సలహా మండళ్ళను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె వివరించారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?