
అనర్హత పిటిషన్‌పై చర్యలకు ఒక ప్రక్రియ అంటూ ఉంటుందని, ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఇరుపక్షాల వాదనలు వింటామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేసారు. వైసీపీ ఎంపీ రాఘురామకృష్ణరాజుపై తామిచ్చిన అనర్హత పటిషన్‌పై స్పీకర్ బిర్లా జాప్యం చేస్తున్నారని అంటూ వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల అసహనం వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆ విషయంపై రన్నింగ్ కామెంటరీ చేయలేమని స్పీకర్ తేల్చి చెప్పారు.
ఈ విషయమై సభను స్తంభింపజేస్తామని వైసీపీ ఎంపీలు చెప్పడంపై స్పందించిన స్పీకర్ సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పారు. రఘురామ అనర్హత పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కోరిన విషయం తెలిసిందే.
గత శుక్రవారం స్పీకర్‌ను కలిసిన ఆయన పిటిషన్ వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని వెల్లడించారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని పేర్కొనడం స్పీకర్ ను బెదిరించే విధంగా ఉన్నాయని అంటూ విమర్శలు చెలరేగుతున్నాయి.
కాగా, ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని ఓంబిర్లా ప్రకటించారు. జూలై 19 నుంచి ఆగస్టు 13 సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఆ రెండు తేదీల మధ్య మొత్తం 19 పనిదినాల్లో ఉభయసభల కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఓంబిర్లా ఇవాళ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించి కాసేపు మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలను అనుసరించి వచ్చే ఎంపీలు, మీడియా ప్రతినిధులు అందరినీ పార్లమెంటు లోపలికి అనుమతిస్తారని స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు.
ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి కాదని చెప్పారు. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం దయచేసి వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, పార్లమెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 322 మంది ఎంపీలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ ఉభయసభలకు (లోక్‌సభ, రాజ్యసభ) ఇవే టైమింగ్స్ వర్తిస్తాయని ఆయన వెల్లడించారు.
More Stories
బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
బాక్సింగ్ చాంపియన్షిప్స్లో రెండు బంగారు పతకాలు