నగల వ్యాపారి నీరవ్‌మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,000 కోట్లకుపైగా మోసగించిన కేసులో తాజాగా ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. నీరవ్ సోదరి పుర్వీ మోదీ అలియాస్ పుర్వీ మెహతా ఈ కేసులో అప్రూవర్‌గా మారుతూ, తన బ్రిటన్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.17.25 కోట్లు భారత ప్రభుత్వానికి బదిలీ చేసింది.
బ్రిటన్ పౌరులైన పుర్వీ, ఆమె భర్త మైయాంక్ మెహతాలు ఇప్పటివరకూ ఈ కేసు దర్యాప్తులో పాలుపంచుకోలేదు. అయితే లండన్‌లో తన పేరిట ఉన్న బ్యాంకు ఖాతా గురించి ఇటీవల తెలుసుకున్నానని, అది తన సోదరుడి తరపున ప్రారంభమైనట్లు తెలిసిందని, ఆ ఖాతాలో ఉన్న డబ్బు తనదికాదని పుర్వీ జూన్ 24న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు తెలిపింది.
ఆ తర్వాత కేసులో అప్రూవర్‌గా మారుతూ ఆ ఖాతా నుంచి 23,16,889 డాలర్లు భారత ప్రభుత్వపు బ్యాంకు ఖాతాకు పంపించినట్లు ఈడీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో పీఎన్‌బీ ఫ్రాడ్ నేరానికి సంబంధించి రూ.17.25 కోట్లు రికవరీ చేసుకున్నట్లయ్యిందని ఈడీ పేర్కొంది.
అలాగే రూ.579 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి సహకరిస్తానంటూ పుర్వీ మోదీ తెలిపినట్లు ఈడీ పేర్కొన్నది. దేశం నుంచి పరారైన నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్ జైలులో ఉండగా, ఈ కేసులో మరో నేరగాడిగా ఉన్న మెహుల్ చోక్సీని కూడా కరేబియన్ దీవుల్లో అరెస్టు చేసిన సంగతీ విదితమే.

More Stories
దేశ ఆర్థిక వ్యవస్థపై టెక్ రంగంలో లేఆఫ్స్ ప్రభావం
షట్‌డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ