
నౌకాయాన రంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. శనివారం ఆయన విశాఖ పోర్ట్ ఛైర్మన్, అధికారులతో భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతికి ప్రజెంటేషన్ ద్వారా పోర్టు పురోగతి వివరాలను విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ రామ్మోహన్ వెల్లడించారు. విశాఖ ట్రస్టు విస్తరణ ప్రణాళికలను ఉపరాష్ట్రపతి అభినందించారు.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థలో నౌకాశ్రయాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. దేశంలో పోర్టుల ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాగర్‌మాల’ కార్యక్రమం చేపట్టిందని గుర్తు చేశారు. 504 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని వెంకయ్యనాయుడు తెలిపారు.
సాగరమాల ద్వారా రూ.3.57లక్షల కోట్ల మౌలికవసతులు కల్పించామని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం, 200 కి పైగా పెద్ద , చిన్న ఓడరేవులతో ప్రపంచ షిప్పింగ్ మార్గాల్లో భారతదేశం వ్యూహాత్మకంగా ఉందని గమనించిన ఆయన, “ఈ నౌకాశ్రయాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి” అని చెప్పారు.
పురాతన భారతదేశం గొప్ప సముద్ర శక్తి అని, చోళ రాజులు, కళింగ రాజుల నావికాదళాలు మహాసముద్రాలను పాలించటానికి ఉపయోగించాయని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, “మనం ఆ గత వైభవాన్ని తిరిగి పొందాలి” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా విశాఖ నౌకాశ్రయంలో కార్గో ధోరణి క్షీణించడం గమనించిన ఉపరాష్ట్రపతి, పరిస్థితి సాధారణమైన తర్వాత ఓడరేవు తన వృద్ధి పథాన్ని తిరిగి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “కోవిడ్ అనంతర ఆర్థిక పునరుద్ధరణలో ఓడరేవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని గమనించడం ముఖ్యం” అని ఆయన చెప్పారు.
కోవిడ్ -19 మహమ్మారి, తుఖ్టే, యాస్ తుఫాన్ లు, కరోనా రెండో వేవ్ సందర్భంగా ఆక్సిజన్ సరఫరా, మానవతా సహాయక చర్యలను నిర్వహించడంలో ఓడరేవులు నిర్వహించిన పాత్రను ఆయన ప్రశంసించారు. అందుకు వారందరిని అభినందించారు.
తొలుత మూడు రోజుల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయనకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పోర్టు ట్రస్టు చైర్మన్ రామ్మోహన్‌రావు, డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, సి.వి.వో ప్రదీప్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు