కరోనాపై సోష‌ల్ మీడియాలో అన్నీ త‌ప్పుడు రాత‌లే!

భారతదేశంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అన్నింటిలో కరోనా చికిత్సకు సంబంధించి త‌ప్పుడు రాత‌లే ఉంటున్నాయి. ఈ సంస్థలకు హిందీ, ఇత‌ర భాష‌ల‌కు సంబంధించిన వాస్తవాల‌ను తనిఖీ చేసే స‌రైన వ్యవస్థ లేనందున మరింత ఎక్కువగా త‌ప్పుడు సమాచారం వ‌స్తున్న‌ది. 

ఈ విష‌యాలు అమెరికాలోని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నివేదికలో వెల్లడైంది. వీరి నివేదిక‌ ప్రకారం, ఏప్రిల్-మే నెల మధ్య ఇటువంటి 150 పోస్టులు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ఈ పోస్టుల‌న్నింటిలో కరోనాకు సంబంధించి స్వదేశీ చికిత్స పద్ధతులను చెప్పారు.

గ‌మ్మ‌త్తైన విషయం ఏమిటంటే 10 కోట్లకు పైగా ప్రజలు వీటిని అనుసరిస్తున్నారు. ఇలాంటి త‌ప్పుడు పోస్టుల‌పై నిఘా అంతంత మాత్రంగానే ఉన్న‌ది. ఎవ‌రైనా వినియోగ‌దారులు ఫిర్యాదు చేసిన‌ట్ల‌యితేనే స‌ద‌రు పోస్ట్‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇలా జూన్ వరకు 150 లో 10 పోస్టులను మాత్ర‌మే తొలగించారు లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు లేబుల్ చేశారు. అలాగే వారం రోజుల్లో ట్విట్టర్‌లో 60 కి పైగా క్లెయిమ్స్ రాగా, వీటిని 35 ల‌క్ష‌ల మంది అనుసరించారు.

ఫాక్ట్ చెక్ సైట్ ఆల్ట్ న్యూస్ ప్రతీక్ సిన్హా ప్రకారం, తప్పుడు సమాచారాన్ని గుర్తించి వాటిని తొల‌గించేందుకు భార‌త్‌కు సంబంధించి ఇప్పుడున్న సిబ్బంది స‌రిపోరు. 

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. భారతదేశం. అమెరికాలలో ప్రకటనల ధరల్లో తేడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ డబ్బు లేదు. అందుక‌ని ఫాక్ట్ చెక్ నిమిత్తం సిబ్బందిపై ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడానికి ఆయా సంస్థ‌లు ఆసక్తి చూపడం లేదని ఆమెపేర్కున్నారు.