
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అనుమానిత ఐసిస్ ఉగ్రవాది మహ్మద్ ఆషిక్ (25)ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మైలదుతురైలో గురువారం రాత్రి ఆషిక్‌ను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.
2018లో కోయంబత్తూరులో కొందరు నేతలను టార్గెట్ చేసినట్లు నమోదైన నేరపూరిత కుట్ర కేసులో ఆషిక్ నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించింది. అరెస్టు చేసిన తర్వాత ఆషిక్‌ను చెన్నైకి తరలించింది.
ఎన్ఐఏ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు కలిసి కోయంబత్తూరులో ఓ బృందంగా ఏర్పడ్డారు. వీరంతా 2018లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)కు విధేయతను ప్రకటించారు.
కోయంబత్తూరులో కొందరు నేతలను హత్య చేసి, మత సామరస్యాన్ని దెబ్బతీయడంతోపాటు దేశ భద్రత, సార్వభౌమాధికారాలకు విఘాతం కలిగించాలని కుట్రపన్నారు. ఆ ముఠాలో మహమ్మద్ ఆషిక్ కూడా ఒకడని ఎన్ఐఏ తెలిపింది.
మైలదుతురైకి సమీపంలోని నీడూర్‌లో బ్రాయిలర్ షాపులో పని చేస్తుండగా ఆషిక్‌ను గురువారం రాత్రి అరెస్టు చేశారు. 2018 సెప్టెంబరులోనే ఆషిక్ ముఠాను ఎన్ఐఏ అరెస్టు చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆషిక్‌కు గతంలో బెయిలు మంజూరైంది. ఆ తర్వాత తను కోర్టు విచారణకు హాజరు కావడం మానేయడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా