బైపాస్ సర్జరీ తర్వాత రాష్ట్రపతి భవన్‌కు తిరిగొచ్చిన కోవింద్

రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ బైపాస్ స‌ర్జ‌రీ చేయించుకుని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు తిరిగొచ్చారు. కోవింద్‌కు న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో బైపాస్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు.

“శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యంగా రాష్ట్రపతి భవన్‌కు తిరిగి వచ్చాను. మీ అందరి అభిమానం, ప్రార్థనలతో తిరిగి ఆరోగ్యంగా త‌యార‌య్యాను. ఎయిమ్స్, ఆర్మీ ఆర్ఆర్ ఆసుపత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అసాధారణమైన సంరక్షణ కార‌ణంగా వేగంగా కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు. ఇంటికి తిరిగి వ‌చ్చినందుకు సంతోషంగా ఉన్న‌ది ”అని కోవింద్ ట్వీట్ చేశారు.

75 ఏండ్ల వ‌య‌సున్న రామ్‌నాథ్‌ కోవింద్ మార్చి 30 న న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో కార్డియాక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.

“రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎయిమ్స్‌లోని ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిరంతరం మెరుగుపడుతున్న‌ది. వైద్యులు నిరంతరం ఆయ‌న‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారుష అని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఏప్రిల్ 3 న ఒక ట్వీట్‌లో తెలిపింది.