
బీజేపీ దివంగత నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. ప్రధాని మోదీ ఒత్తిడి తట్టుకోలేక పోవడంతో సుష్మా, జైట్లీ చనిపోయారని ఎన్నికల సభలో ఉదయనిధి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించాలని, డీఎంకే స్టార్ ప్రచార కర్తల జాబితా నుంచి ఆయన పేరును తొలగించాలని బిజెపి కోరింది. చెపాక్ – ట్రిప్లికేన్ స్థానం నుంచి ఉదయనిధి పోటీ చేస్తున్నారు.
‘ప్రధాని అవుతారనుకున్న అద్వానీని మోదీ పక్కనపెట్టారు. మోదీ టార్చర్ భరించలేక యశ్వంత్‌సిన్హా పార్టీ వీడారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక సుష్మ, జైట్లీ మరణించారు. సీనియర్ నేత వెంకయ్య నాయుడును మోదీ పక్కనపెట్టారు’ అని ఉదయనిధి బిజెపి సీనియర్ నేతలను ప్రస్తావిస్తూ అనుచిత వాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై సుష్మ కూతురు బాన్సురీ, జైట్లీ కూతురు సొనాలీ తీవ్రంగా స్పందించారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రంగా బాధపడింది. మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. రాజకీయాల కోసం డీఎంకే ఇంత దిగజారింది’ అని సుష్మ స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ట్వీట్లో పేర్కొంది.
ఉదయనిధి వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ భక్షి కూడా స్పందించింది. ‘ఉదయనిధి గారు మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పారు. మా నాన్నను అగౌరవపరుస్తున్నారు. అరుణ్‌జైట్లీ, నరేంద్ర మోదీ మధ్యం రాజకీయంగా కాకుండా గొప్ప బంధం ఉంది. ఆ స్నేహాన్ని తప్పుపట్టవద్దని కోరుతున్నా’ అని సోనాలీ ట్వీట్ చేసింది.
సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ బీజేపీలో అగ్ర నాయకులు. వాజ్‌పేయి హయాంలో వీరిద్దరు కేంద్ర మంత్రులుగా పని చేయగా అనంతరం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సుష్మ, జైట్లీ 2019 ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం