
బెంగాల్‌లో బీజేపీకి 200 సీట్లు వస్తాయని కొన్ని వారాల క్రితం జనం అనుకున్నారని, అయితే తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి మంచి స్టార్ట్ వచ్చిందని, ప్రజల గొంతుకు దేవుడి ఆశీస్సులు లభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బెంగాల్‌లో ఈసారి బీజేపీకి 200 కన్నా ఎక్కువే సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ ప్రధాని మోదీ జయానగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఇవాళ రెండవ దశ పోలింగ్ జరుగుతోందని, పోలింగ్ బూత్‌కు భారీ సంఖ్యలో ఓటర్లు వస్తున్నారని, ఎక్కడ చూసినా బీజేపీ హవా ఉందని, బెంగాల్‌లో బీజేపీ హవా కొనసాగుతోందని పేర్కొన్నారు.
కూల్ కూల్ అని దీదీ అంటున్నారని, తృణమూల్ కూల్‌గా లేదని, అది శూలంగా మారిందని, ఆ శూలం వల్ల ప్రజలు విపరీతగా బాధపడుతున్నారని ప్రధాని ఆరోపించారు. దుర్గా పూజలు చేసినా అలాగే చికాకు పడతారని, తాజాగా బొట్టు పెట్టుకున్నా, కాషాయ వస్త్రాలు ధరించినా, చికాకు పడుతున్నారని మోదీ విమర్శించారు.
‘‘దీదీ…. మీకు ఎవర్నైనా ప్రసన్నం చేసుకునే హక్కు మీకుంది. నన్ను తిట్టాలనుకుంటే… తిడుతూనే ఉండండి. కానీ… ప్రజల భక్తిశ్రద్ధల్ని కించపరచడాన్ని అంగీకరించం.’’ అని మోదీ పేర్కొన్నారు. మొదటి దశ పోలింగ్ పూర్తైన తర్వాత మమత చికాకు మరింత పెరిగిపోయిందన్నారు. సాయం కోసం అనేక మందికి లేఖలు రాస్తున్నారని, అవుట్ సైడర్స్ మద్దతు కోరుతున్నారని మోదీ ఎద్దేవా చేశారు.
కాగా, అస్సాం ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి మరోసారి రెడ్ కార్డు చూపారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తొలి విడత పోలింగ్ లోనే అస్సాం ప్రజలు ఎన్డీఏను ఆశీర్వదించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల్లో హింస జరుగుతున్న ఆ పార్టీ నాయకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని విమర్శించారు.
అస్సాం రాష్ట్రం కోక్రాఝర్ పరిధిలోని బిజ్నీలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు. అస్సాం అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్డీఏ కట్టుబడి ఉందని, ఎన్డీఏపైనే ప్రజలు నమ్మకంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అత్యధిక మెజార్టీతో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు