బంగ్లాదేశ్ విముక్తి కోసం జైలుకెళ్లా

బంగ్లాదేశ్ విముక్తి కోసం జైలుకెళ్లా

బంగ్లాదేశ్ స్వాతంత్య్రం  కోసం తాను చేసిన సత్యాగ్రహం తన రాజకీయ జీవితం తొలినాళ్ళలో చేసిన పోరాటాల్లో ఒకటని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తన రాజకీయ జీవితంలో కూడా బంగ్లాదేశ్ స్వాతంత్య్ర  పోరాటం చాలా ముఖ్యమైనదని చెప్పారు.

తాను తన సహచరులతో కలిసి భారత దేశంలో సత్యాగ్రహం చేశానని చెప్పారు. అప్పట్లో తన వయసు ఇరవైలలో ఉండేదని పేర్కొన్నారు. ఈ సత్యాగ్రహం సందర్భంగా జైలుకు కూడా వెళ్ళానని చెప్పారు.  ఉగ్రవాదం వంటి ఉపద్రవాలను ఎదుర్కోవడానికి మనం కలసి ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు.

శుక్రవారం బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆ దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత బంగ్లాదేశ్ సైనికులు, వారికి సహకరించిన భారతీయులు చేసిన గొప్ప త్యాగాలను ఎన్నటికీ మర్చిపోబోమని తెలిపారు. వారి ధైర్య, సాహసాలు ఎన్నటికీ మరపురావని కొనియాడారు. 

ఢాకాలోని నేషనల్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బంగ్లాదేశ్ నేషనల్ డే ఉత్సవాల్లో మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ, తన జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైనదని, ఈరోజు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో తనను భాగస్వామిని చేసినందుకు బంగ్లాదేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

తొలుత, ప్ర‌ధాని నరేంద్ర‌మోదీకి బంగ్లాదేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ ఉద‌యం ఎయిరిండియా విమానంలో బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాలోని హ‌జ్ర‌త్ షాహ‌జాలాల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకున్న ప్ర‌ధాని మోదీకి హ‌సీనా పుష్ప‌గుచ్ఛం అందించి స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం బంగ్లాదేశ్ ర‌క్ష‌ణ బ‌ల‌గాలు ప్ర‌ధాని మోదీకి గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించాయి. బంగ్లా ప్ర‌ధాని షేక్ హ‌సీనాతో క‌లిసి ఆయ‌న వారి నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

అంతకుముందు మోదీ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్‌తో చర్చలు జరిపారు. వివిధ మతాల పెద్దలు, మైనారిటీల ప్రతినిధులు, స్వాతంత్ర్య సమర యోధులు, భారత దేశ మిత్రులు, యూత్ ఐకాన్స్‌తో సమావేశమయ్యారని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

బంగారు భవిత కోసం భారత్-బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అంతకు ముందు పేర్కొన్నారు. భారత ఉపఖండంలోని దేశాల ప్రజలు సునాయాసంగా చదువుకోవడం, పని చేసుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం సాధ్యమయ్యే పరిస్థితులు అవసరమని చెప్పారు. 

ఆయన రెండు రోజులపాటు బంగ్లాదేశ్‌‌లో పర్యటిస్తున్న సందర్భంగా శుక్రవారం ఆ దేశ పత్రిక ‘ది డైలీ స్టార్’లో మోదీ ఓ వ్యాసాన్ని రాశారు.  బంగబంధు విభిన్న దక్షిణాసియా కల’ శీర్షికతో మోదీ రాసిన వ్యాసంలోని బంగారు భవిష్యత్తు కోసం భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య గాఢమైన సత్సంబంధాలు ఉండాలని మోదీ ఆకాంక్షించారు.  ఈ ఉపఖండంలో సునాయాసంగా చదువుకోవడం, పని చేయడం, వ్యాపారాలు చేయడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించవలసిన అవసరం ఉందని తెలిపారు.