రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ  టీఆర్ఎస్ ఆధిక్యం

తెలంగాణలో పోటాపోటీగా జరిగిన రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు సుధీర్ఘంగా మూడవ రోజూ కొనసాగుతున్నది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. 
 
ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రాధాన్యత ఓట్ల విధానంలో ఫలితాలు ఎప్పుడు, ఎటు మారతాయో అర్థంకాక అభ్యర్థులు, ఆయా పార్టీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా విజేత ఎవరో తేలే అవకాశాలు కనబడటం లేదు.  
ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారనున్నది. తుది ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడే అవకాశం ఉన్నది. శుక్రవారం తెల్లవారుజాముకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి 30%, ఎస్‌ వాణీదేవి 31.5% ఓట్లు సాధించారు.
 
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఆరో రౌండ్ పూర్తి అయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతి రౌండ్‌లో సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై దాదాపు 7 వేల మెజార్టీ కనబరుస్తున్నారు. 
 ఆరో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ఆధిక్యంలో ఉండగా, రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు,  మూడో స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్, నాలుగో స్థానంలో చిన్నారెడ్డి ఉన్నారు.
ఆరవ రౌండ్ పూర్తి అయ్యే సమయానికి వాణిదేవికి 1,05,710 ఓట్లు, రామచంద్రరావుకు 98,084 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 50,450 ఓట్లు, చిన్నారెడ్డికి 29,627ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి రామచంద్రరావుపై 7,626 ఓట్ల ఆధిక్యతతో సురభి వాణీదేవి కొనసాగుతున్నారు.
 
ఇక నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించిన మొత్తం ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. మొత్తం వ్యాలిడ్ ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో.. సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.ఇక ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఏడు రౌండ్ ముగిసే టైంకి… టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా  రాజేశ్వరరెడ్డికి 1 లక్ష 10 వేల 840 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నకు 83 వేల 290 ఓట్లు పోలయ్యాయి. కోదండరాంకు 70 వేల 72 ఓట్లు… ప్రేమేందర్ రెడ్డికి 39 వేల 107 ఓట్లు వచ్చాయి. 7 రౌండ్లలో మొత్తం 21 వేల 636 ఓట్లు చెల్లకుండా పోయాయి.

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా, నల్గొండలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ తీన్మార్‌ మల్లన్నగా పోటీ సాగుతోంది. ఈ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు, నల్గొండ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం ఒక రికార్డయితే…ఓటర్లు సైతం అదే స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనడం మరో రికార్డు. నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో దినపత్రిక పరిమాణంలో జంబో బ్యాలెట్ పత్రం ఉండటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుధీర్ఘంగా కొనసాగుతోంది.