వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడమీ అవార్డు

 
 కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి, రచయిత ఎం వీరప్ప మొయిలీకి సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మక పురస్కారంగా పిలిచే సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2020 సంవత్సరానికి గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఆయనతో పాటు ప్రముఖ కవియిత్రి అరుంధతీ సుబ్రమణ్యమ్‌తోపాటు మరో 18 మందికి కూడా ఈ అవార్డు లభించింది.
 
 ‘శ్రీ బాహుబలి అహింసాదిగ్విజయం’ పేరిట కన్నడలో మొయిలీ రచించిన ఇతిహాస కావ్యానికి, ‘వెన్‌ గాడ్‌ ఇజ్‌ ఏ ట్రావెలర్‌’ పేరిట ఇంగ్లీష్‌లో అరుంధతి రాసిన కవితా సంకలనానికి ఈ పురస్కారం లభించినట్టు అకాడమీ పేర్కొంది. తెలుగులో,  ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌కు 2020 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన రాసిన ‘అగ్నిశ్వాస’ కవితా సంకలనానికి ఈ పురస్కారం లభించినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. 
 
 అవార్డులు పొందినవారిలో ఇమాయియం(తమిళం), అనామిక(హిందీ), ఆర్‌ఎస్‌ భాస్కర్ ‌(కొంకణి), హరీశ్‌ మీనాక్షి(గుజరాతీ), ఇరుంగ్బమ్‌ దేవన్ ‌(మణిపుర్‌), రూప్‌ చంద్‌ హన్స్‌దా (సంతాలి), నందకిషోర్ ‌(మరాఠీ), మహేశ్‌చంద్ర గౌతమ్ ‌(సంస్కృతం), హుస్సేన్‌ ఉల్‌ హక్ ‌(ఉర్దూ), అపూర్వ కుమార్‌సైకియా (అస్సామీ), దివంగత హిదయ్‌ కౌల్‌ భారతి (కశ్మీరీ), ధరనింధర్‌ ఓవరి (బోడో) తదితరులు కూడా ఉన్నారు. పురస్కారం కింద రూ. లక్ష నగదు లభిస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలో వెల్లడించనున్నారు.
 
2020 సంవత్సరానికి కన్నెగంటి అనసూయ రాసిన ‘స్నేహితులు’కు బాల సాహితీ పురస్కారం, ఎండ్లూరి మానస (మిళింద కథలు)కు యువ సాహితీ పురస్కారం దక్కాయని చెప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎండ్లూరి మానస తెలుగులో అనేక కథలు రాశారు. మరాఠీ నవల ‘ఓ’ ని 2015లో ‘ఊరికి దక్షిణాన’గా తెలుగులోకి అనువదించారు. 
 
20 భాషలకు చెందిన ఏడు కవితా పుస్తకాలకు, నాలుగు నవలలకు, ఐదు చిన్న కథలకు, రెండు నాటకాలకు, ఒక వృత్తాంతానికి, మరొక ఇతిహాస కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది.  ఈ అవార్డులతో పాటు 21 మందికి బాలసాహిత్య పురస్కారాలు, 18 మందికి యువ పురస్కారాలను సాహిత్య అకాడమీ ప్రకటించింది.